NTV Telugu Site icon

Mallikarjun Kharge: ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ పేపర్లు కావాలి.. ఖర్గే డిమాండ్..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్(ఈవీఎం)లపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం మాట్లాడుతూ.. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్‌ని ఉపయోగించాలని సూచించారు. ‘‘మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగి వారిని పక్కకు నెట్టాలి. ఎన్నికల గురించి నేను మాట్లాడకూడదని అనునకుంటున్నాను. కానీ పేద, అణగారిన వర్గాల ఓట్లు వృధా కాబోతున్నాయని నేను ఖచ్చితంగా చెబుతాను. వారందరూ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాలని డిమాండ్ చేయాలి.’’ అని ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగే ‘‘సంవిధాన్ రక్షక్ అభియాన్’’ కార్యక్రమంలో చెప్పారు.

మాకు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేయాలని కోరతున్నామని, అప్పుడు వారి పరిస్థితి ఏంటో, ఎక్కడుంటారో తెలుస్తుందని బీజేపీని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌కి తిరిగి వెళ్లాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ని ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల్లో ఓడినప్పుడే ఓటింగ్ మిషన్లు ట్యాంపరింగ్ గుర్తుకు వస్తుందా..? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Read Also: Karnataka: ముస్లింల ఓటు హక్కు రద్దు చేయాలి.. హిందూ స్వామిజీ సంచలన వ్యాఖ్యలు..

బ్యాలెట్ పేపర్‌ ద్వారా ఎన్నికలు జరగడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరుపున ప్రతీ ఒక్కరూ బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి పొందేలా ప్రచారాన్ని ప్రారంభిస్తామని, మేము ఇతర రాజకీయ పార్టీలో కూడా మాట్లాడుతున్నామని, రాహుల్ గాంధీ ఉద్యమం ప్రారంభించాలని ఖర్గే కోరారు. అంతకుముందు, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాన్ని తాము అంగీకరించడం లేదని, ఈవీఎం సమస్యను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లో 288 సీట్లకు గానూ బీజేపీ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ సొంతగా 132 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాలకే పరిమితమైంది. మొత్తంగా ప్రతిపక్ష ఇండియా కూటమి 49 సీట్లను మాత్రమే గెలుచుకుంది. హర్యానా ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ ఈవీఎంలని తప్పుపట్టింది. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటింగ్ యంత్రాలు సురక్షతంగా, పటిష్టంగా ఉన్నాయని చెప్పారు.