Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన భారత్ వ్యతిరేకతను చాటుకుంటూ ఓ వీడియోలో బెదిరించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని, ప్రయాణిస్తే వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతాయంటూ బెదిరించాడు.
‘‘నవంబర్ 19న ఎయిర్ ఇండియా ద్వారా ప్రయాణించవద్దని సిక్కు ప్రజల్ని కోరుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా దిగ్బంధనం ఉంటుంది. ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం’’ అని వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు మూసేయబడుతుంది, దాని పేరు మార్చబడుతుంది, అదే రోజు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని హైలెట్ చేస్తూ హెచ్చరించాడు.
అంతకుముందు కూడా పన్నూ ఇలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం నుంచి నేర్చుకోవాలని అన్నాడు. పంజాబ్ నుంచి పాలస్తీనా వరకు అక్రమ ఆక్రమణలో ఉన్న వారంతా ప్రతిస్పందిస్తారు. హింస హింసని ప్రేరేపిస్తుంది అని గతంలో ఓ వీడియోల బెదిరించే ప్రయత్నం చేశాడు.
అమృత్‌సర్ లో జన్మించిన గురుపత్వంత్ సింగ్ పన్నూపై 2019లో ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అతడిని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. అమెరికా, యూకే, కెనడా కేంద్రంగా ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నాడు. ఇతనకి పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2021లో ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్స్ జారీ చేసింది. గతేడాది నవంబర్ లో అతడిని ప్రకటిత నేరస్తుడిగా గుర్తించింది.