NTV Telugu Site icon

Pakistan: పొలిటికల్ మైలేజ్ కోసం భారత ఎన్నికల్లోకి మమ్మల్ని లాగొద్దు.. పాక్ కీలక వ్యాఖ్యలు..

Pakistan

Pakistan

Pakistan: భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పొలిటికల్ మైలేజ్ కోసం మా దేశాన్ని ఇందులోకి లాగొద్దని పాకిస్తాన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ శుక్రవారం అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం తమ ప్రసంగాల్లో పాకిస్తాన్‌ని లాగడం మానేయాలని భారత నేతల్ని పాకిస్తాన్ కోరింది. జమ్మూ కాశ్మీర్‌పై భారత నేతలు చేస్తున్న అన్ని వాదనల్ని తిరస్కరిస్తున్నట్లు పాకిస్తాన్ చెప్పింది.

భారతదేశ రాజకీయ నాయకులు ఎన్నికల ఉద్దేశాల కోసం ఎన్నికల బహిరంగ ప్రసంగాల్లో పాకిస్తాన్‌ గురించి ప్రస్తావించే నిర్లక్ష్య పద్ధతిని విరమించుకోవాలని జహ్రా బలోచ్ కోరారు. జమ్మూ కాశ్మీర్‌పై అసమంజసమైన వాదనల్ని, రెచ్చగొట్టే ప్రకటనల్లో భయంకరమైన పెరుగుదలను మేము చూస్తున్నామని, హైపర్ నేషనలిజం కోసం ఇలాంటి ప్రసంగాలు ప్రాంతీయ శాంతికి తీవ్ర ముప్పును కలిగిస్తుందని ఆమె అన్నారు.

Read Also: Maldives: మాల్దీవులలో చైనా రీసెర్చ్ షిప్.. ముయిజ్జూ భారీ విజయం తర్వాత కీలక పరిణామం..

భారతదేశ వాదనలు చారిత్రక, చట్టపరమైన వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆమె అన్నారు. జమ్మూ కాశ్మీర్‌పై నిరాధారమైన వాదనల్ని ఆమె తోసిపుచ్చారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల పలు సందర్భాల్లో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగాలుగా, విడదీయరాని భాగాలుగా ఉంటాయని, ఈ విషయంలో ఇతర దేశాల జోక్యం లేదని చెప్పింది.

మరోవైపు భారతదేశ ఎన్నికలపై పాకిస్తాన్ నజర్ పెట్టింది. ఈ సారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై అక్కడి నాయకుల్లో, ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్, ఉగ్రవాదం విషయంలో భారత్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి వాదన లేకుండా పోయింది. దీని తర్వాత పాకిస్తాన్, భారత్‌తో వ్యాపార-వాణిజ్య సంబంధాలను నిలిపేసింది. అయితే, ప్రస్తుతం పాక్ వ్యాపారులు, భారత్‌తో సంబంధాలు పునరుద్ధరించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారైనా తమతో సున్నితంగా వ్యవహరించే ప్రభుత్వం వస్తుందా..? అని పాకిస్తాన్ చూస్తోంది.