Site icon NTV Telugu

Supreme Court: పాక్ ఆర్టిస్టులను భారత్‌లో బ్యాన్ చేయాలి.. “సంకుచిత మనస్తత్వం” వద్దన్న సుప్రీంకోర్టు..

Supreme Court

Supreme Court

Supreme Court: పాకిస్తాన్‌కి చెందిన ఆర్టిస్టులను భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడంపై, వారు ఇక్కడ పనిచేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ ‘‘అంత సంకుచిత మనస్తత్వం’’ కలిగి ఉండవద్దని కోరింది. ఈ పిటిషన్‌ని అత్యున్నత కోర్టు కొట్టేసింది. సినీ వర్కర్, ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేసిన బాంబే హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టీలతో కూడిన సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ‘‘మీరు ఈ అప్పీల్‌పై ఒత్తిడి చేయవద్దు. అంత సంకుచిత భావంతో ఉండకండి’’ అని ధర్మాసనం పేర్కొంది.

Read Also: Sonia Gandhi: కాంగ్రెస్‌కు ఓటు వేయండి.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

గతంలో పిటిషన్‌పై బాంబే హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా బహిష్కరించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. భారతీయ పౌరులు, కంపెనీలు, సంస్థలు, సంఘాలు పాకిస్తాన్ ఆర్టిస్టులతో సంబంధాలు పెట్టుకోకుండా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇంతకుముందు విచారించిన బాంబే హైకోర్టు, సాంస్కృతిక సామరస్యం, ఐక్యత, శాంతిని పెంపొందించడంలో పిటిషనర్ పిటిషన్ తిరోగమన దశ అని, అందులో ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ కొట్టేసింది.

దేశ భక్తుడిగా ఉండాలంటే విదేశాలను ముఖ్యంగా పొరుగు దేశాలకు చెందిన వారిపై శత్రుత్వం చూపాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. నిజమైన దేశ భక్తుడు నిస్వార్థపరుడు, తన దేశం కోసం అంకితభావంతో ఉన్న వ్యక్తి ఇలాంటివి చేయడని, మంచి హృదయం ఉన్న వ్యక్తి తన దేశంలోని ఏదైనా పనిని స్వాగతిస్తాడని, ఇది దేశంలో, సరిహద్దులో శాంతి, సామరస్యం, ప్రశాంతతను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. కళలు, సంగీతం, క్రీడలు, సంస్కృతి, నృత్యం మొదలైన కార్యకలాపాలు జాతీయతలు, సంస్కృతులు దేశాల మధ్య శాంతి, ఐక్యత, ప్రశాంతతను కలిగిస్తాయని బాంబే హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. క్రికెట్ ప్రపంచకప్ లో పాకిస్తాన్ పాల్గొందన్న విషయాన్ని గుర్తు చేసింది.

Exit mobile version