DMK MLA Markandeyan: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ అరెస్ట్.. ఎందుకంటే?

  • ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు
  • డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ అరెస్ట్
  • కరుణానిధి జయంతి సభలో వివాదాస్పద వ్యాఖ్యలు
Dmk Mla Markandeyan Arreste

Dmk Mla Markandeyan Arreste

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తమిళగ వెట్రి కళగం (TVK) నేతలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తూత్తుకుడి జిల్లా విలాతికులం ప్రాంతంలోని మార్కండేయన్ నివాసానికి భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి న్యాయపరమైన ప్రక్రియ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

కరుణానిధి జయంతి సభలో వివాదాస్పద వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపక నేత ఎం. కరుణానిధి జయంతి సందర్భంగా విలాతికులం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో మార్కండేయన్ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ TVK కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించి, ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు

మార్కండేయన్ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తూత్తుకుడి జిల్లాలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మార్కండేయన్ అరెస్టుకు కొద్ది రోజుల ముందు మరో డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ కూడా ఇదే తరహా ఆరోపణలపై అరెస్టయ్యారు.

తిరుచెందూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనితా రాధాకృష్ణన్ జూన్ 20న ముఖ్యమంత్రి విజయ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ TVK పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తిరస్కరించడంతో, తూత్తుకుడి సమీపంలోని ఆత్తూర్‌లో ఉన్న సమయంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఏ సెక్షన్ల కింద కేసులు?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని కింది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సెక్షన్ 352: ఉద్దేశపూర్వకంగా అవమానించి శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం.
సెక్షన్ 353(2): ప్రజల్లో అల్లర్లు లేదా ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేయడం.
ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.