Site icon NTV Telugu

DK Shivakumar: ‘‘ఓట్లు వేస్తేనే నీరు’’.. డిప్యూటీ సీఎంపై పోలీస్ కేసు..

Dk Shiva Kumar

Dk Shiva Kumar

DK Shivakumar: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదైంది. బెంగళూర్ రూరల్ నుంచి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ సురేష్‌కి ఓటే వేస్తే కావేరి నది నుంచి నీటిని అందిస్తాము’’ అని డీకే శివకుమార్ బెంగళూర్ ఓటర్లకు చెబుతున్న ఓ వీడియో వైరల్ అయింది.

తన సోదరుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని హౌసింగ్ సొసైటీతో తాను ‘‘వ్యాపార ఒప్పందం’’ కోసం వచ్చానని, ప్రజలన తన సోదరుడికి ఓటు వేస్తే కావేరి నీటికి హామీ ఇస్తానని చెప్పడం వీడియోల ఉంది. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆయన ప్రసంగం మోడల్ కోడ్‌ని ఉల్లంఘించిందని, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసినందుకు పోలీస్ కేసు నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కర్ణాటక లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 26 మరియు మే 7న రెండు దశల్లో జరగనుండగా, జూన్ 4న అన్ని స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి.

Read Also: Neha Murder Case: “నా కొడుకు చేసింది తప్పే”.. క్షమాపణలు కోరిన నిందితుడు ఫయాజ్ తల్లి..

దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రం బీజేపీకి కీలకంగా ఉంది. ఈ సారి జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఆ రాష్ట్రంలోని 28 ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇటీవల వెలువడిన అన్ని సంస్థల ఒపీనియన్ పోల్ కూడా బీజేపీ 20కి మించి స్థానాలను సాధిస్తుందని అంచనా వేశాయి. అయితే, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఈ రాష్ట్రం నుంచి మెజారిటీ సీట్లు సాధించాలని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇటీవల బెంగళూర్ వ్యాప్తంగా నీటి సంక్షోభం నెలకొంది. అయితే, దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని కావేరి నదీ నీటిని ఇస్తామని డీకే శివకుమార్ పేర్కొనడం వివాదాస్పదం అయింది. బెంగళూరుకు రోజూ 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరం, ప్రస్తుత సరఫరా అవసరమైన దానిలో సగం నీరు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది.

Exit mobile version