Site icon NTV Telugu

DK Shivakumar: డీకే.శివకుమార్ రాజీనామా అంటూ పుకార్లు! కర్ణాటకలో ఏం జరుగుతోంది!

Dk Shivakumar

Dk Shivakumar

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పుపై గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో మరోసారి ఇదే రకమైన చర్చ నడుస్తోంది. ప్రభుత్వ ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తైన సందర్భంగా సిద్ధరామయ్య మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాహుల్‌గాంధీతో సమావేశమై కీలక చర్చలు జరిపారు.

ఇది కూడా చదవండి: Israel: పాలస్తీనా దేశాన్ని అంగీకరించబోం.. యూఎన్ తీర్మానానికి ముందు ఇజ్రాయెల్ ప్రకటన

ఈ నేపథ్యంలో డీకే.శివకుమార్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీమానా చేసినట్లు పుకార్లు నడుస్తున్నాయి. మీడియాలో వార్తలు హల్‌చల్ చేయడంతో తాజాగా ఇదే అంశంపై డీకే.శివకుమార్ స్పందించారు. తాను పార్టీకి క్రమశిక్షణ కలిగిన సైనికుడినని.. రాజీనామా వార్తలు పుకార్లుంటూ తోసిపుచ్చారు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా సిద్ధరామయ్యదేనని.. పార్టీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే ఇది జరుగుతోందని పేర్కొన్నారు. తాను ఢిల్లీ వెళ్లింది రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను కర్ణాటకకు ఆహ్వానించడానికి వెళ్లినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 100 కాంగ్రెస్ కార్యాలయాల శంకుస్థాపన చేయబోతున్నామని.. దీనికి ఆహ్వానించేందుకు మాత్రమే ఢిల్లీ వెళ్లినట్లుగా క్లారిటీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Congo Video: కాంగోలో కూలిన మైనింగ్ గని వంతెన.. 32 మంది మృతి

‘‘శంకుస్థాపన కార్యక్రమాలు.. ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరు నిర్వహిస్తారు? నేనే చేయాలి. నేను (రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి) రాజీనామా చేస్తానని ఎందుకు చెబుతారు? ఆ పరిస్థితి ఇంకా తలెత్తలేదు.’’ అని శివకుమార్ ఢిల్లీలో విలేకరులతో అన్నారు. రాజీనామా ఊహాగానాలన్నీ మీడియా సృష్టేనని తెలిపారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు తాను చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ కోసం రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశానని… భవిష్యత్తులో కూడా ఇలానే చేస్తానని వెల్లడించారు. 2028లో కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన కర్తవ్యం అని వెల్లడించారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం ఢిల్లీలో రాహుల్‌గాంధీని కలిశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, అనేక అంశాలపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి భేటీ తర్వాతే డీకే.శివకుమార్ రాజీనామా చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. మొత్తానికి డీకే.శివకుమార్ క్లారిటీ ఇచ్చేశారు.

 

Exit mobile version