NTV Telugu Site icon

Disha Salian Case: దిశా సాలియన్ మరణం కేసు రీ ఓపెన్.. ఆదిత్య ఠాక్రే, రియాలపై ఎఫ్ఐఆర్..

Disha Salian Case

Disha Salian Case

Disha Salian Case: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణంపై కేసు తిరిగి ప్రారంభమైంది. జూన్ 8, 2020న ముంబైలో మలాడ్ ప్రాంతంలోని ఓ భవనం 14వ అంతస్తు నుంచి పడి దిశా సాలియన్ మరణించింది. అయితే, ఈ కేసులో దిశ తండ్రి సతీష్ సాలియన్ ముంబై హైకోర్టుని ఆశ్రయించారు. దిశా మరణించిన 6 రోజులకు దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దిశా, సుశాంత్‌కి కూడా మేనేజర్‌గా పనిచేసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు మరణాల్లో మిస్టరీ ఉందని అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ ఆరోపించింది.

Read Also: iPhone: పేరెంట్స్ “ఐఫోన్” కొనివ్వలేదని ఆత్మాహత్యాయత్నం చేసిన అమ్మాయి..

తాజాగా, సతీష్ సాలియన్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో శివసేన(యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, నటి రియా చక్రవర్తి, నలుడు డినో మోరియా, సూరజ్ పంచోలితో సహా హై ప్రొఫైల్ వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దిశా మరణంపై ఆమె తండ్రి మరింత లోతైన విచారణను డిమాండ్ చేస్తున్నారు. తన కుమార్తె మరణంపై అనేక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని, రాజకీయ జోక్యం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డపై లైంగిక దాడి చేసి చంపేశారని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ కేసులో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరు ఉండటంతో ఇది సంచలనంగా మారింది.

తాజాగా, ముంబై కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(క్రైమ్) ఈ ఫిర్యాదుని అధికారికంగా అంగీకరించింది. ఎఫ్‌ఐఆర్‌లో మొత్తం తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆదిత్య థాకరే, డినో మోరియా, సూరజ్ పంచోలి, రియా చక్రవర్తితో పాటు, ఇందులో సూరజ్ పంచోలి అంగరక్షకుడు, మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్, తొలగించబడిన పోలీసు అధికారి సచిన్ వాజే, ఇతరులు కూడా ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో జాబితా చేయబడిన వారందరూ పెద్ద కుట్రలో పాల్గొన్నారని, నేరాన్ని కప్పిపుచ్చారని సతీష్ సాలియన్ న్యాయవాది పేర్కొన్నారు.