NTV Telugu Site icon

Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..

Rohit Vemula

Rohit Vemula

Rohith Vemula: 2016లో హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల మరణం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయంగా సంచలనంగా మారింది. రోహిత్ వేముల ఆత్మహత్యపై హైదరాబాద్ పోలీసులు విచారణను ముగించారు. తాను దళితుడు కాదనే విషయం బయటపడుతుందనే భయంతోనే ఆయన ఆత్మహత్య పాల్పడ్డాడని కోర్టుకు పోలీసులు క్లోజర్ రిపోర్టు సమర్పించారు. అయితే, పోలీసుల విచారణను రోహిత్ వేముల తల్లి అంగీకరించలేదు. దీనిపై మరోసారి విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

READ ALSO: Dinesh Karthik: నాకు బ్యాటింగ్‌ వస్తుందనుకోలేదు: దినేశ్‌ కార్తిక్‌

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రోహిత్ వేముల మృతిపై విచారణలో చాలా వైరుధ్యాలు ఉన్నాయని, ఆయన కుటుంబానికి న్యాయం జరిగేలా తెలంగాణలోని తమ ప్రభుత్వం చూస్తుందని, ఎలాంటి అవకాశాన్ని వదలదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజేషన్, కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ రోహిత్ వేముల మరణం బీజేపీ ‘‘దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని’’ పూర్తిగా బయటపెట్టిన ఘోరమైన ఘటన అని అన్నారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ ఈ కష్టకాలంలో రోహిత్ వేముల కుటుంబానికి అండగా నిలిచిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు క్లోజర్ రిపోర్ట్ జూన్ 2023లోనే తయారైందని ఆయన అన్నారు.

కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా క్యాంపస్‌లలో కుల, మతపరమైన అఘాయిత్యాల సమస్యల్ని పరిష్కరించేందుకు రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని అన్నారు. సామాజిక-ఆర్థిక వెనుకబాటు నుండి వచ్చిన విద్యార్థులెవరూ అదే దుస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగవని కేసీ వేణుగోపాల్ అన్నారు. అంతకుముందు రోహిత్ వేముల తల్లి రాధిక హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కేసులో మరోసారి విచారణ జరిపి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.