NTV Telugu Site icon

Arvind Kejriwal: కావాలనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు..

Arvind Kejriwal3

Arvind Kejriwal3

Arvind Kejriwal: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేస్తోందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తాను జైలు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేయడం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగానే తాను సీఎం పదవికి రాజీనామా చేయలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కేజ్రీవాల్ అన్నారు. బుధవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జూన్ 1 తర్వాత మధ్యంతర బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా జైలు నుంచి విధులు నిర్వహించడానికి కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఢిల్లి లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌‌ని ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. 50 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడిని అరెస్ట్ చేసినప్పటి నుంచి సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

Read Also: Deve Gowda: “వెంటనే పోలీసులకు లొంగిపో, నా ఆగ్రహాన్ని చూడొద్దు”.. ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని హెచ్చరిక..

తన పార్టీని, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, ఇతర నాయకుల్ని బీజేపీ ప్రభుత్వం నకిలీ కేసుల్లో ఇరికించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘ ఆదాయపు పన్ను కమిషనర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత నేను ఢిల్లీ మురికివాడల్లో పనిచేశారు. 2013లో 49 రోజుల్లో తానున ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సందర్భంలో నా రాజీనామాను ఎవరు అడగలేదు. ప్యూన్ కూడా తన ఉద్యోగాన్ని వదులుకోడు, కానీ నేను ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టాను’’ అని కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుతం నా పోరాటంలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలేదని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి 67 అసెంబ్లీ సీట్లు (2015లో), 62 సీట్లు (2020లో) వచ్చాయని కేజ్రీవాల్ అన్నారు, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ని ఓడించలేమని ప్రధాని నరేంద్రమోదీ చూసి తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. తాను రాజీనామా చేస్తానని, ఆ తర్వాత నా ప్రభుత్వాన్ని పడగొట్టాలని పీఎం మోడీ తనను అరెస్ట్ చేసినట్లు కేజ్రీవాల్ అన్నారు. అతని కుట్ర విజయం కాదు, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం నకిలీది అని అన్నారు. నేను అక్రమంగా డబ్బు సంపాదించి ఉంటే, బీజేపీలోకి వెళ్లి శిక్షను తప్పించుకునేవాడినని, అలా చేయకపోవడంతోనే తనను జైల్లో పెట్టినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేస్తే ఏదో ఒక రోజు మమతా బెనర్జీ, స్టాలిన్‌లను అరెస్ట్ చేసి రాజీనామా చేయాలని కోరుతారని ఆయన అన్నారు. అప్పుడు వారి ప్రభుత్వాలను పడగొడతారని, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని చెప్పారు.