Covid-19: కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో భారతదేశంలో ఆయుర్దాయం గణనీయంగా తగ్గిందని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ఓ అధ్యయనం ప్రచురించబడింది. అయితే, ఈ స్టడీని భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అధ్యయనం యొక్క ఫలితాలు ఆమోదయోగ్యం కాదని చెప్పింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 2019 మరియు 2020 మధ్య భారతదేశం 2.6 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కోల్పోయిందని పేర్కొంది. సామాజికంగా వెనకబడిన సమూహాలు, ముస్లింలు, షెడ్యూల్డ్ తెగలు అత్యంత తీవ్రంగా ప్రభావితమైనట్లు అధ్యయనం పేర్కొంది. పురుషులతో పోలిస్తే (2.1 ఏళ్లు) స్త్రీలు (3.1 ఏళ్లు) ఎక్కువగా నష్టపోయినట్లు తెలిపింది.
అయితే, ఈ అధ్యయనం లోపభూయిష్టం ఉందని మంత్రిత్వ శాఖ ఎత్తిచూపింది. రచయితలు 2021 జనవరి – ఏప్రిల్ మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) నుంచి మొత్తం దేశ మరణాల రేటును అంచనా వేయడానికి గృహాల ప్రాతినిధ్యం లేని ఉపసమితిని ఉపయోగించారని చెప్పింది. NFHS నమూనా మొత్తంగా చూసినప్పుడు మాత్రమే జాతీయ మరణాల తీరును ఖచ్చితంగా సూచిస్తుందని మంత్రిత్వ శాఖ చెప్పింది. 14 రాష్ట్రాల్లో కేవలం 23 శాతం కుటుంబాలను విశ్లేషించడం జాతీయ మరణాల ధోరణులను ఖచ్చితంగా ప్రతిబింబించదని కేంద్రం నొక్కి చెప్పింది.
Read Also: Venus: శుక్రుడిపై జీవం ఉందా..? కొత్త చర్చకు దారి తీసిన ఫాస్ఫైన్ ఆవిష్కరణ..
కోవిడ్-19 మహమ్మారి సమయంలో సేకరించిన డేటా రిపోర్టింగ్‌లో పక్షపాతాలను నివేదించడం వంటి అధ్యయంలోని విషయాలను మంత్రిత్వ శాఖ విమర్శించింది. ఇండియా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(సీఆర్ఎస్) నమ్మకమైందని, 99 శాతం మరణాలను సంగ్రహిస్తుందని చెప్పింది. స్టడీలో 2019తో పోల్చితే 2020లో మరణాల నమోదులు దాదాపు 474,000 పెరిగాయని ప్రభుత్వం గమనించింది, ఇది అంతకుముందు సంవత్సరాల వలే ఉంది, కేవలం మహమ్మారి మాత్రమే కారణం కాదని చెప్పింది. మరణాల సంఖ్యలకు అధిక జనాభా పెరగడం కూడా కారణమని మంత్రిత్వ శాఖ చెప్పింది. దేశవ్యాప్తంగా విస్తృత మరియు వైవిధ్యభరితమైన జనాభాను కలిగి ఉన్న శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(SRS), 2019తో పోలిస్తే 2020లో అతి తక్కువ మరణాల సంఖ్యను నమోదు చేసిందని ప్రభుత్వం హైలైట్ చేసింది.
అధ్యయనం పేర్కొన్న వయసు, లింగ సంబంధిత మరణాల పెరుగదలకు సంబంధించిన విషయాలను ప్రభుత్వం సవాల్ చేసింది. కోవిడ్-19 మరణాలు మగవారిలో, వృద్ధుల్లో ఎక్కువ ఉన్నాయని అధికారిక డేటా సూచిస్తుంది. ఇది యువకులు, స్త్రీలపై పెద్దగా ప్రభావం చూపించలేదన్న లేదు. అయితే, అధ్యయనంలో మాత్రం స్త్రీలపై ఎక్కువగా ప్రభావం చూపించిందని చెప్పింది. ఇలాంటి అధ్యయన ఫలితాలు దాని వాదనలపై ఉన్న విశ్వాసాన్ని తగ్గిస్తాయని కేంద్రం పేర్కొంది.