హోం వర్క్ చేయలేదని ఐదేళ్ల బాలికపై తల్లి కర్కషంగా వ్యవహరించారు. కాళ్లు, చేతులు కట్టేసి ఎర్రని ఎండకు డాబాపై పడుకోబెట్టింది. పైన ఎండ, కింద డాబా వేడికి చిన్నారి విలవిల్లాడింది. అయినా ఆ తల్లి మనసు కరగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని తుఖ్ మీర్ పూర్ ప్రాంతంలోని కర్వాల్ నగర్ లో చోటు చేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న బాలిక హోం వర్క్ చేయనుందకు 5-7 నిమిషాల పాటు తల్లి ఈ శిక్ష విధించినట్లు తెలుస్తోంది.
ఈ ఉదంతాన్ని స్థానికులు వీడియో తీసి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా ఈ వీడియో కర్వాల్ నగర్ ప్రాంతానికి చెందినదిగా సమాచారం అందింది. అయితే అక్కడ ఇలాంటి ఘటన జరగకపోవడంతో.. మరికొన్ని ప్రాంతాల్లో పోలీసులు ఆరా తీయగా ఖజూరీ ఖాస్ ప్రాంతానికి చెందినగా పోలీసులు గుర్తించారు. చిన్నారి హోం వర్క్ చేయకపోవడంతో తల్లి ఇలా చేసిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే వీడియో వైరల్ కావడంతో నెటిజెన్లు తీవ్రం స్పందిస్తున్నారు. ఈ వీడియోలో ఎర్రని ఎండ, డాబా వేడికి తాళలేక చిన్నారి అరుస్తుండటంతో పాటు తాడును విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. నెటిజన్ల నుంచి ఫిర్యాదు రావడంతో పోలీసులు చర్యలకు దిగుతున్నారు. ప్రస్తుతం బాధిత చిన్నారి కుటుంబాన్ని గుర్తించినట్లు..తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.