Delhi Woman Dies After Car Drags Her For 12 Kilometres On New Year Morning: న్యూ ఇయర్ రోజు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒళ్లుగగుర్పాటుకు గురయ్యే యాక్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. మహిళను ఢీకొట్టిన తర్వాత దాదాపుగా 10-12 కిలోమీటర్లు లాక్కెలింది కారు. ఈ ప్రమాదంలో మహిళ శరీరం దాదాపుగా ఛిద్రం అయింది. ఈ ఘటన ఢిల్లీలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే మృతురాలు అంజలి (20) ఢిల్లీ నివాసి. మహిళ పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లలో పార్ట్ టైమ్ వర్కర్ గా పనిచేస్తుంది. ఆదివారం కూడా ఇలాంటి ఫంక్షన్ కు హాజరై ఇంటికి స్కూటీపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మహిళను కారు సుల్తాన్‌పురి నుండి ఢిల్లీలోని కంఝవాలా వరకు నాలుగు కిలోమీటర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది. కారులోని ఐదుగురు వ్యక్తులు తన కూతురుపై అత్యాచారం జరిపారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రోహిణి జిల్లాలోని కంఝవాల్ పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో కుతుబ్‌గఢ్ వైపు వెళ్తున్న గ్రే బాలెనో కారు మహిళ మృతదేహాన్ని ఈడ్చుకెళ్తోందని కాల్ వచ్చిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు ఢిల్లీ పోలీసులు.
Read Also: Crime News: భార్యతో గొడవపెట్టుకుని బిడ్డను నేలకేసి కొట్టిన తండ్రి
కారు నంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమ కారు స్కూటీతో ప్రమాదానికి గురైందని నిందితులు చెప్పారు, అయితే ఆమెను తమ కారుతో పాటు అనేక కిలోమీటర్లు ఈడ్చుకెళ్లినట్లు తమకు తెలియదని నిందితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అత్యాచారం ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రమాద సమయంలో నిందితులు మద్యం తాగి ఉన్నారా..? అనే వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. వారి శాంపిళ్లను పరీక్షలకు పంపారు.
ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. ఈ ఘటన చూసి షాక్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు. ఈ కేసులను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్పందిస్తూ కారులో ఉన్న వ్యక్తులు మద్యం తాగి ఉన్నారని సమాచారం అని అన్నారు. ఐదుగురు వ్యక్తుల మద్యం తాగి డ్రైవింగ్ చేశారా..డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.