Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..

Delhi Police

Delhi Police

Intel Alert: దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరుగొచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు హెచ్చరించాయి. కీలక ప్రాంతాల్లో ఐఈడీలతో దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెప్పడంతో, భద్రతను భారీగా మోహరించారు. ముప్పు దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని దాని కార్యాలయం, సమీపంలోని ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతను పెంచారు. అదనపు పోలీసు బలగాలను మోహరించారు, బారికేడ్లను పెంచారు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Read Also: Milk: ఈ 8 ఆహారాలను పాలతో కలిపి తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే..

సెంట్రల్ ఢిల్లీలోని కీలక కార్యాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగవచ్చని ఏజెన్సీలకు సమాచారం అందింది. ఆత్మాహుతి దాడులు, వాహనాల్లో ఐఈడీలు పెట్టి పేల్చడం, కాల్పులు, సమన్వయ దాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. ప్రభుత్వ భవనాలు, రాజకీయ కార్యాలయాలు, మార్కెట్లు, రవాణా కేంద్రాలు, ఇతర రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, క్విక్ రియాక్షన్ టీములను అప్రమత్తం చేశారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్‌ను అప్రమత్తం చేశారు.

ఇటీవల, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఆదేశాల మేరకు భారత్ లో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్న పాకిస్తానీ గ్యాంగ్ స్టర్, ఉగ్రవాది షాజాద్ భట్టి ముఠాను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఛేదించింది. 9 మంది నిందితుల్ని అరెస్ట్ చేసింది.