Delhi riots case: 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం (UAPA) చట్టం కింద అరెస్టయిన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై భారత సుప్రీంకోర్టు జనవరి 5న తన తీర్పును ప్రకటించనుంది. వీరిద్దరితో పాటు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మొహమ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు అరవింద్ కుమార్, ఎన్ వి అంజరియాలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఈ కేసులో ‘‘పెద్ద కుట్ర’’దాగి ఉందని ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 2న ఇచ్చిన ఉత్వరుల్ని నిందితులు అత్యున్నత కోర్టులో దాఖలు చేశారు.
ఈ కేసుపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 10న తన తీర్పును రిజర్వ్ చేసింది. ఢిల్లీ పోలీసుల తరుపున రపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు హాజరుకాగా, నిందితుల తరుపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ దవే, సల్మాన్ ఖుర్షీద్, సిద్ధార్థ్ లూత్రాలు వాదించారు. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ ఈ కేసులో కీలక నిందితులుగా, అల్లర్లకు ముఖ్య సూత్రధారులుగా ఉన్నారు. వీరిపై యూఏపీఏ కేసు నమోదైంది.
Read Also: Jana Nayakudu Trailer: ‘ముట్టుకోకు ముక్కలు చేస్తాడు’.. ‘జన నాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది!
పౌరసత్వ సవరణ చట్టం (CAA) మరియు ప్రతిపాదిత జాతీయ పౌర పౌరసత్వ రిజిస్టర్ (NRC)కి వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ‘‘పాలనను మార్చే కుట్ర’’దాగి ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌ను అస్థిర పరచడానికి, ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని దించే ఆపరేషన్‌లో భాగంగా ఆరోపించారు. మత ప్రాతిపదికన నిందితులు రూపొందించిన భారీ కుట్రగా అభివర్ణించారు.
అల్లర్ల కోసం ‘‘చక్కా జామ్’’ ఆలోచనకు ఉమర్ ఖలీద్ కీలకమని, ఢిల్లీ ప్రొటెస్ట్ సపోర్ట్ గ్రూపు పేరుతో హింసను ప్లాన్ చేయడంలో కీలక పాత్ర పోషించాడని ప్రధాన ఆరోపణ. అల్లర్ల సమయంలో ఉపయోగించడానికి స్థానిక మహిళలను కత్తులు, రాళ్లు, యాసిడ్ సీసాలు, ఇతర వస్తువులను నిల్వ చేయమని ఇతరులకు ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షర్జీల్ ఇమామ్ ఉమర్ ఖలీద్, ఇతర కుట్రదారుల మార్గదర్శకత్వంలో పనిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతను జామియా మిలియా ఇస్లామియా, అసన్‌సోల్‌లో ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి, జాతీయ రాజధానిని స్తంభింపజేయడానికి విధ్వంసకరమైన “చక్కా జామ్”కు పిలుపునిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
