BJP 1984 anti-Sikh riots memorial rally: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం (నవంబర్ 1) రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ప్రతిపక్ష INDIA కూటమి, అధికార బీజేపీ ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఒకవైపు ఎన్నికల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ INDIA కూటమి ‘చలో ఢిల్లీ’ ర్యాలీ నిర్వహిస్తోంది. మరోవైపు 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్ల బాధితులకు నివాళులర్పిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ రెండు కార్యక్రమాలతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
INDIA కూటమి ‘చలో ఢిల్లీ’ ర్యాలీ
ఎన్నికల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ INDIA కూటమి రాంలీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు INDIA కూటమికి చెందిన ఎంపీలు ఉదయం 11 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ వద్ద సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు మింటో రోడ్-కనాట్ ప్లేస్ జంక్షన్ నుంచి రాంలీలా మైదాన్ వరకు మార్చ్ నిర్వహించనున్నారు.
INDIA కూటమికి కౌంటర్‌గా బీజేపీ నిరసన
మరోవైపు INDIA కూటమి ర్యాలీకి పోటీగా బీజేపీ కూడా ప్రత్యేక నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితులకు నివాళులర్పించేందుకు పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ నుంచి తిలక్ నగర్ వరకు మార్చ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా నాయకత్వం వహించనున్నారు. నవంబర్ 1న ఉదయం 11:30 గంటలకు హరి నగర్ బస్ డిపో నుంచి తిలక్ నగర్ మెట్రో స్టేషన్ వరకు ఈ మార్చ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, సర్దార్ హెచ్.ఎస్. ఫూల్కా, మంజిందర్ సింగ్ సిర్సా, ఎంపీ బాన్సురి స్వరాజ్‌తో పాటు సిక్కు సమాజానికి చెందిన పలువురు పాల్గొననున్నారు.
1984 సిక్కుల అల్లర్లపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ
1984 నవంబర్ 1న జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాజకీయ పునరాగమనానికి ప్రయత్నించే ముందు సిక్కు సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. 1984 అక్టోబర్ 31 సాయంత్రం నుంచి నవంబర్ 3 వరకు జరిగిన హింసాత్మక ఘటనలు భారత చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. ఆ సమయంలో వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారని, వారి ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేసి నిప్పంటించారని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, ఉదయం 10:30 గంటలకు బీజేపీ ఎంపీ విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ గురుద్వారా షహీద్ గంజ్ సాహిబ్ వద్ద 1984 అల్లర్ల బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు.
ఢిల్లీలో రాజకీయ పోరు ఆసక్తికరం
ఒకే రోజు INDIA కూటమి, బీజేపీ వేర్వేరు అంశాలపై నిరసన కార్యక్రమాలు నిర్వహించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షాల ఆరోపణలు, 1984 సిక్కుల వ్యతిరేక అల్లర్లపై బీజేపీ చేస్తున్న నిరసనతో ఢిల్లీలో రాజకీయ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనే నాయకుల ప్రసంగాలు, రాజకీయ విమర్శలు, తదుపరి పరిణామాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

