Site icon NTV Telugu

Akhilesh Yadav: మోడీ, యోగిల మధ్య ఆధిపత్య పోరు.. సంభాల్ మసీదు వివాదంపై అఖిలేష్..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌ ఇటీవల తీవ్ర హింస చెలరేగింది. నగరంలోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై అక్కడి గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. వేల మంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో మొత్తం 7 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. స్థానిక సమాజ్‌వాదీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉంటే, మంగళవారం పార్లమెంట్‌ సమావేశాల్లో సమాజ్‌వాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ సంభాల్ హింసని లేవనెత్తారు. ఈ హింస బీజేపీ పన్నిన కుట్రగా ఆరోపించారు. ఐదుగురు మరణాలకు పోలీసులు, ఇతర అధికారులు బాధ్యులని, వారిపై హత్యానేరం మోపాలని డిమాండ్ చేశారు. ‘‘సంభాల్‌లో జరిగిన ఘటన పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర.. ఉత్తరప్రదేశ్‌లో నవంబర్‌ 13న ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నవంబర్‌ 20కి వాయిదా పడింది.. పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలి. ఇది ఢిల్లీ, లక్నోల మధ్య జరుగుతున్న పోరాటం’’ అని వ్యాఖ్యానించారు.

Read Also: S Jaishankar: భారత్-చైనా సంబంధాలపై పార్లమెంట్‌లో EAM ప్రకటన..

ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మధ్య ఆధిపత్య పోరు నెలకొందని సంచలన ఆరోపణలు చేశారు. లక్నో, ఢిల్లీ మధ్య ఆధిపత్య పోరు నెలకొందని అన్నారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎన్డీయే నేతలు తీవ్రంగా ఖండించారు. నిరసన వ్యక్తం చేశారు. దీంతో లోక్‌సభ వాయిదా పడింది.

మొఘల్ కాలంలోని జామా మసీదు, ప్రాచీన హిందూ ఆలయం హరిహర్ మందిరంపై నిర్మించారని, బాబర్ కాలంలో ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లు హిందూ పక్షం స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, కోర్టు మసీదు సర్వేకి ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సర్వేకి వెళ్లిన అధికారులపై ఓ ముస్లిం వర్గం దాడికి పాల్పడింది. దీంతో హింస చెలరేగింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలో సోదరభావాన్ని నాశనం చేస్తున్నాయంటూ అఖిలేష్ మండిపడ్డారు.

Exit mobile version