ఎప్‌స్టీన్ కేసులో కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తె హిమయానీ పూరికి ఊరట లభించింది. అమెరికన్ లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో హిమయానీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా దాఖలు వేశారు. దీంతో మంగళవారం ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Pak-Afghan war: పిరికిపంద.. అమానుష దాడి.. పాక్ ఘాతుకాన్ని ఖండించిన భారత్
సోషల్ మీడియాలో అటువంటి కంటెంట్‌ను ఏ విధంగానూ ప్రచురించడం లేదా వ్యాప్తి చేయడాన్ని ఏ మాత్రం యోగ్యం కాదని జస్టిస్ మినీ పుష్కర్ణ తప్పుపట్టారు. హిమాయనీ పూరి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరుపుతూ.. సోషల్ మీడియా వినియోగదారులు పోస్టులను తొలగించకపోతే.. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లే కంటెంట్‌ను తొలగిస్తాయని స్పష్టం చేశారు. హిమయానీ పూర్తికి అనుకూలంగా ప్రాథమికంగా కేసు రుజువైందని.. మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే ఆమెకు పూడ్చలేని నష్టాన్ని కలిగించినట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసింది.
ఇక హిమయానీ పూరి తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. తన క్లయింట్‌కు ఆర్థిక నిపుణురాలిగా ప్రపంచ ఖ్యాతి ఉందని.. ఆమెను కాపాడుకోవాలని.. ఆరోపణలు పూర్తిగా అబద్ధం, నిరాధారం, దురుద్దేశపూరితమైనవిగా పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 22, 2026న యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్‌డిన్, డిజిటల్ న్యూస్ పోర్టల్స్, ఇతర వెబ్ ఆధారిత ప్రచురణలతో సహా సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల్లో హిమయానీపై తప్పుడు ప్రచారం జరిగింది. ఎప్‌స్టీన్‌తో హిమయానీ పూరికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపార, ఆర్థిక లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెళ్లువెత్తాయి. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఆమెకు ఢిల్లీ హైకోర్టు అండగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
