NTV Telugu Site icon

Om Birla: లోక్‌సభ స్పీకర్ కుమార్తెకు ఊరట.. నెటిజన్ల ట్రోల్స్ తొలగించాలని హైకోర్టు ఆదేశం

Ombirladaughter

Ombirladaughter

యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఉద్యోగం సంపాదించడంపై పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్ కుమార్తె కాబట్టి ఏదైనా సాధ్యమేనంటూ విపరీతంగా ఆమెపై నెట్టింట ట్రోల్స్ నడిచాయి. తండ్రిని అడ్డంపెట్టుకుని ఐఆర్‌పీఎస్ అధికారిణిగా అంజలి ఎంపిక అయిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె మంగళవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారంటూ ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా చేశారు. నిరాధార పోస్టుల్ని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో ప్రతివాదులుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), ఇతరు సంస్థలను చేర్చారు. తాజాగా ఆమె అభ్యర్థనను న్యాయస్థానం స్వీకరించి ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో కామెంట్లు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది.

ఓం బిర్లా కుమార్తెకు పరువు నష్టం కలిగించే పోస్ట్‌లను 24 గంటల్లోగా తొలగించాలని గూగుల్, ఎక్స్ మరియు ఇతర సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌లో పనిచేస్తున్న అంజలి… తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడి యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిందని ఆమెపై పోస్టులు పెట్టారు. యూపీఎస్సీ పరీక్షలు రాసేంత వరకు ఆమె రీల్స్ చేస్తూ ఉండేదని.. అలాంటిది ఆమె తొలి ప్రయత్నంలోనే జాబ్ ఎలా కొట్టిందని ట్రోల్స్ నడిచాయి.

ఇటీవల కాలంలో యూపీఎస్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పూణెకు చెందిన పూజా ఖేద్కర్.. తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్‌కు ఎంపిక కావడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె సర్వీస్‌ను నిలిపివేసింది. యూపీఎస్సీని ప్రక్షాళన చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయడం విశేషం.