CJP protest: కాక్రోచ్ జనతా పార్టీ (CJP)కి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 16న ఢివల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో సీజేపీ చేపట్టనున్న నిరసనను నిలిపివేయడానికి కోర్టు నిరాకరించింది. అయితే, నిరసనను నియంత్రించేందుకు, శాంతిభద్రతల్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టానికి అనుగుణంగా నిరసనను నియంత్రించాలని పోలీసుల్ని ఆదేశించింది.
ఈ నిరసనపై చర్యలు తీసుకునేలా ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించాలని కోరుతూ కన్నాట్‌ప్లేస్ వ్యాపారి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. పండగ సీజన్లో సెంట్రల్ ఢిల్లీలో నిరసనల కారణంగా దుకాణాలు మూసివేయడంతో వ్యాపారులు నష్టపోతున్నారని పిటిషనర్ తరుఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. సీజేపీ కార్యకలాపాలను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నామని, పిటిషనర్ ఆందోళన్ని పరిష్కరిస్తామని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు హామీ ఇచ్చారు.
అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో సాయంత్రం 5 గంటలకు నిరసనలకు సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని, నిరసనకారులు జాతీయ జెండాలను పట్టుకుని రావాలని పిలుపునిచ్చారు. సీజేపీ కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లో జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను పట్టుకుని నిరసన తెలుపుతున్నందుకు పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. కోర్టు వీరిద్దరికి ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో సీజేపీ ఈ కొత్త నిరసనలకు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉండటంతో వీరిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే, జాతీయ జెండాను రెపరెపలాడిస్తే జైలుకు పంపిస్తారా? అని సీజేపీ, వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

