ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఫలితాలు వచ్చి 6 రోజులు అవుతున్నా.. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. దీంతో ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే ప్రధాని మోడీ ప్రస్తుతం భారత్‌లో లేరు. రెండు దేశాల పర్యటన కోసం సోమవారం ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు వెళ్లారు. దీంతో ఢిల్లీ సీఎం ఎంపిక వాయిదా పడింది. ప్రస్తుతం మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన ముగించుకుని ఈ వారమే ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం (ఫిబ్రవరి 16) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తోంది. దీని కోసం ఇద్దరు బీజేపీ సీనియర్ నాయకులను పంపించనుంది. ఈ సమావేశంలో తదుపరి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చనున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పోస్టుతో పాటు రెండు డిప్యూటీ సీఎం పోస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ముఖ్యమంత్రిగా మహిళలకు ఛాన్స్ ఇవ్వొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తు్న్నాయి. అంతేకాకుండా అందులో దళితులకు అవకాశం ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇక కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపికపై బీజేపీ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద గట్టెక్కింది.