NTV Telugu Site icon

Delhi Elections: సీఎం అతిషి ఆస్తులు ఎంతంటే..!

Atishi

Atishi

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం అతిషి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇక సీఎం అతిషి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నుంచి అల్కా లాంబా పోటీ చేస్తుండగా… బీజేపీ నుంచి ప్రముఖ నేత రమేష్ సింగ్ బిధురి బరిలో ఉన్నారు. ముగ్గురు నేతలు నామినేషన్లు దాఖలు వేశారు. తాజాగా అఫిడవిట్‌లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి.

ముఖ్యమంత్రి అతిషి..
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆస్తుల విలువ రూ.76,93,347.98 ఉన్నట్లుగా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో తన సంపద 28.66 శాతం పెరిగిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎటువంటి స్థిరాస్తి లేదని తెలిపారు. ఆభరణాల పేరుతో కేవలం 10 గ్రాముల బంగారం మాత్రమే ఉందని వెల్లడించారు. సొంత కారు లేదా ఇతర ఎలాంటి వాహనం కూడా లేదని పేర్కొన్నారు. రెండు క్రిమినల్ పరువు నష్టం కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలియజేశారు. ప్రస్తుతం రూ. 30 వేల నగదు ఉందని, తనకు మూడు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

అల్కా లాంబా…
ఇక కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా కూడా ఆస్తుల వివరాలు తెలియజేశారు. అల్కా లాంబాకు మొత్తం రూ.3.41 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.61.12 లక్షల విలువైన చరాస్తులు ఉండగా, ఆమె బంధువుకి రూ.14.36 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో రూ.20.12 లక్షలు పెరిగినట్లుగా చెప్పారు. గురుగ్రామ్‌లో రూ.80 లక్షల విలువైన 500 చదరపు అడుగుల వాణిజ్య ఫ్లాట్‌, ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్-1లో రూ.2 కోట్ల విలువైన నివాస ఆస్తి ఉంది. అఫిడవిట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 8.28 లక్షలు కాగా, 2023-24లో రూ. 8.91 లక్షలు, 2022-23లో రూ. 5.35 లక్షలుగా ఉంది. ఆభరణాల గురించి మాత్రం అఫిడవిట్‌లో వెల్లడించలేదు.

రమేష్ బిధురి…
రమేష్ సింగ్ బిధురి.. కల్కాజీ నుంచి బరిలో ఉన్నారు. 2003, 2008, 2013లో తుగ్లకాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అల్కా లాంబా దాదాపు ఐదేళ్ల పాటు ఆప్‌లో ఉండి 2019లో కాంగ్రెస్‌లో చేరారు. కల్కాజీ నియోజకవర్గంలో మొత్తం 1,94,515 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,893 మంది పురుష ఓటర్లు, 87,617 మంది మహిళా ఓటర్లు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్ ఓటర్లున్నారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.

Show comments