Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన తీవ్ర స్థాయి పేలుడు ఢిల్లీవాసులను భయాందోళనలకు గురిచేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారులో సంభవించిన ఈ పేలుడులో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం సుమారు 6:52 గంటల సమయంలో, సాధారణంగా కార్యాలయాలు ముగిసి ప్రజలు ఇళ్లకు చేరే సమయంలో ఈ దారుణం జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో, రద్దీగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మెల్లగా కదులుతున్న ఒక కారులో ఉన్నట్టుండి పెను శబ్దం చేస్తూ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వలన సమీపంలో ఉన్న అనేక వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతులలో, గాయపడిన వారిలో కొందరు సమీపంలోని పాదచారులు, ఇతర వాహనాలలో ప్రయాణించేవారు ఉన్నారు. గాయపడిన 20 మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ఇది ఉగ్రవాద చర్యనా కాదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రాంతం ఎర్రకోట (లాల్ ఖిలా) కు సమీపంలో ఉండటం, అత్యంత కీలకమైన వాణిజ్య కేంద్రమైన చాందినీ చౌక్ దారిలో ఉండటం వల్ల ఢిల్లీ భద్రతా వ్యవస్థపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ విపత్తుపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, మృతులకు, క్షతగాత్రులకు ఆర్థిక సహాయం (ఎక్స్ గ్రేషియా) ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బాధితులకు అండగా ఉంటామని ఢిల్లీ సర్కార్ వెల్లడించింది. ప్రస్తుతం, ఢిల్లీలోని కీలక ప్రాంతాలలో అధిక భద్రత అమలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల నుండి దర్యాప్తు కొనసాగుతోంది.
Priyank Kharge: అమిత్ షాకు మోడీ రహస్యాలు తెలుసు.. కాంగ్రెస్ మంత్రి ఆరోపణలు..