Delhi Building Collapse: “రక్షించండి”.. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..

  • ఢిల్లీలో విషాదం..
  • కుప్పకూలిన హాస్టల్ భవనం..
  • శిథిలాల కింద 30-50 మంది విద్యార్థులు.?
  • రక్షించాలని ఫోన్ కాల్స్..
Delhi (1)

Delhi (1)

Delhi Building Collapse: ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం 5 అంతస్తులు భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 30 నుంచి 50 మంది విద్యార్థులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. భవనంలో పీజీ హాస్టల్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సండే కావడంతో విద్యార్థుల్లో చాలా మంది భవనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 10 మందిని రెస్క్యూ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. బిల్డింగ్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారికి వైద్య సహాయాన్ని ఆదేశించారు. మరోవైపు, రాహుల్ గాంధీ ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘటనా స్థలంలో సహాయక చర్యల్ని సమీక్షించారు.

ఇదిలా ఉంటే, శిథిలాల కింద చిక్కుకుపోయిన విద్యార్థులు తమను రక్షించాలని కేకలు వేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులు కాపాడాలని ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ చెప్పారు. భవనం కూలడానికి ముందు బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. హాస్టల్ డేస్‌గా పిలిచే ఈ హాస్టల్‌లో ఢిల్లీ యూనివర్సిటీకి సౌత్ క్యాంపస్‌కు దగ్గరగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది.  కూలిన భవనం 20ఏళ్ల పాతదని స్థానికులు చెబుతున్నారు. సత్య నికేతన్ ప్రాంతంలో అనేక పాత ఇళ్లను హాస్టల్స్‌గా మార్చి విద్యార్థులకు అద్దెకు ఇస్తున్నట్లు తెలిపారు.