ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..

  • మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ ఏసీసీ వివేక్ భగత్ ఫిర్యాదు..
  • కులంతో దూషించారని ఏసీపీ ఆరోపణలు..
  • మరోవైపు ఏసీపీపై మహిళా జర్నలిస్ట్ లైంగిక వేధింపుల ఆరోపణ..
  • తన ప్రతిష్టను దెబ్బతీశారని సీజేపీ నేతలపై ఫిర్యాదు..
Acp Vivek Bhagat

Acp Vivek Bhagat

ACP Vivek Bhagat: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇటీవల నిరసన చేపట్టింది. ఈ నిరసనల్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) వివేక్ భగత్‌పై ఒక మహిళా జర్నలిస్టు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అయితే, ఈ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను విధుల్లో ఉన్న సమయంలో ఆమె, మరికొందరు తనను కులం పేరుతో దూషించారని వివేక్ భగత్ ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసటీ చట్టంతో పాటు ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, పరువు నష్టానికి సంబంధించిన చట్టాల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ ఫిర్యాదులో సీజేపీ నాయకులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, రత్నా సింగ్‌ల పేర్లను కూడా ప్రస్తావించారు. జర్నలిస్టు ఆరోపణలపై వీరంతా సోషల్ మీడియాలో తనను అవమానపరిచేలా పోస్టులు పెట్టి, తన ప్రతిష్టను దెబ్బతీశారాని భగత్ పేర్కొన్నారు. అక్టోబర్ 03న జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా బూటా సింగ్ సమీపంలో ఓ మహిళ తన కులాన్ని ప్రస్తావిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేసిందని భగత్ ఆరోపించారు. ఏసీపీగా తన నియామకాన్ని ప్రశ్నిస్తూ ఆమె వ్యాఖ్యలు చేసినప్పటికీ, తాను పట్టించుకోకుండా విధులు నిర్వర్తించినట్లు చెప్పారు. ఇదే రోజు భగత్ నిరసనకారుల్ని అదుపులో పెట్టే క్రమంలో తన విధులకు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో భగత్ పేర్కొన్నారు.

ఇదే రోజు సాయంత్రం మహిళా జర్నలిస్టు, తనపై వివేక భగత్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. ఈ కేసును ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించింది. మహిళ చేసిన ఆరోపణల తర్వాత సీజేపీ నాయకులు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో వివేక్ భగత్‌ పరువు తీసేలా పోస్టులు పెట్టినట్లు భగత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాలను తనకు మానసిక ఒత్తిడిని కలిగించిందని, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసిందని ఏసీపీ భగత్ ఫిర్యాదు చేశారు.