హర్యానాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు కారులో లభ్యమయ్యాయి. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల ఫిర్యాదుతో సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: వైఎస్ జగన్ పొదిలి పర్యటన వాయిదా!
మృతుడు డెహ్రాడూన్‌లో నివాసం ఉంటున్న ప్రవీణ్ మిట్టల్ (42)గా గుర్తించారు. భార్య, తల్లిదండ్రులు, ముగ్గురు చిన్నారులు మృతుల్లో ఉన్నారు. బాగేశ్వర్ ధామ్‌లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమానికి కుటుంబమంతా పంచకులకు వెళ్లింది. అనంతరం తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి పంచకులలోని సెక్టార్ 27లో ఆపి ఉంచిన కారులో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు గమనించి అప్రమత్తం అయ్యారు. వెంటనే హెల్ప్‌లైన్ 112కు ఫోన్ చేశారు. అనంతరం పోలీస్ బృందాలు వచ్చి చూసేసరికి కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఏడుగురు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tragedy : పటాన్ చెరులో విషాదం.. భవనం నుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి
ఇక కారులో ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అందులోని విషయాలను పోలీసులు బహిర్గతం చేయలేదు. కానీ భారీ అప్పులు ఉండడమే కారణం అని రాసి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే.. ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా? అనే దానిపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేయడానికి బంధువులను సంప్రదిస్తున్నట్లు పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్ తెలిపారు. కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు. విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఆరుగురిని ఓజాస్ ఆస్పత్రికి తరలించామని.. ఇంకొకరిని సివిల్ ఆస్పత్రికి తరలించామని.. కానీ అందరూ మరణించినట్లు వైద్యులు చెప్పారన్నారు. ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. వాహనం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు, క్రైమ్ సీన్ బృందాలు నమూనాలు సేకరించాయని చెప్పారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రైవేటు ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు చెప్పారు. ఒకేసారి కుటుంబమంతా చనిపోవడంతో డెహ్రాడూన్‌లోనూ.. పంచకులలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు్న్నారు.