అస్సాం వరదలు ఆ రాష్ట్రానికి తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఓ వైపు వర్షాలు, మరోవైపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల చాలా ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు వరదల వల్ల 173 మరణించారు. ఒక్క శుక్రవారమే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. కాచార్ జిల్లాలో ఆరుగురు, నాగోన్ జిల్లాలో ముగ్గురు, బార్ పేటలో ఇద్దరు, కరీంగంజ్, కోక్రాజార్, లఖింపూర్ లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
30 జిల్లాల్లో 29.70 లక్షల మంది వరద బారిన పడ్డారు. బ్రహ్మపుత్ర, బెకి, కొపిలి, బరాక్, కుషియారా నదులు ప్రమాదకర స్థాయిన దాటి ప్రవహిస్తున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ తో పాటు, ఆర్మీ, కేంద్ర బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. కాచర్ జిల్లాలోని సిల్చార్ పట్టణం ఇప్పటికీ వరద నీటిలోనే ఉంది. రాష్ట్రంలో వరద పరిస్థితిని అంచనా వేయడానికి ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటీ) ఏడు జిల్లాల్లో పర్యటించింది. ఒక్క కాచర్ జిల్లాలోనే 14 లక్షల మంది వరదల బారిన పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 563 సహాయక శిబిరాల్లో మూడు లక్షల మంది ప్రజలు తలదాచుకుంటున్నారు.
మరోవైపు సీఎం హిమంత బిశ్వ శర్మ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నారు. సిల్చార్ ప్రాంతంలో వరదలకు కారణం అయిన బేతుకుండి వాగును, బారక్ వ్యాలీలో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం సందర్శించారు.