NTV Telugu Site icon

Darshan: స్టార్ హీరో దర్శన్‌‌ని ఉరితీయాలి.. రేణుకాస్వామి హత్యపై రైతుల ఆందోళన..

Pavithra Gowda

Pavithra Gowda

Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటక వ్యాప్తంగా దర్శన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యలో దర్శన్ ప్రమేయం నేరుగా ఉండటంతో అతని చుట్టూ ఉచ్చు బిగుసుకుపోయింది. మరోవైపు హత్యకు గురైన రేణుకాస్వామికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. నటి పవిత్ర గౌడతో దర్శన్ సహజీవనం చేస్తుండటంపై రేణుకాస్వామి సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడం, తరుచూ పవిత్రను టార్గెట్ చేయడంతో అతడికి బుద్ధి చెప్పేందుకు బెంగళూర్ పిలిపించి దారుణంగా దాడి చేశారు. దెబ్బలకు తట్టుకోలేక అతను మరణించాడు.

Read Also: Pakisthan: ఫ్లోరిడాలో భారీ వర్షం.. పాకిస్తాన్ ఆశలు గల్లంతు..!

ఇదిలా ఉంటే, రేణుకాస్వామి హత్యలో అరెస్టైన దర్శన్‌ని ఉరి తీయాలని మాండ్యలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. అతడికి గరిష్ట శిక్ష విధించి రేణుకాస్వామికి న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కేసులో దర్శన్న సన్నిహితుడు నాగరాజ్, సహనటుడు ప్రదోష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు దర్శన్, పవిత్ర గౌడలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారున. దర్శన్ వ్యవహారాలన్నింటిని నాగరాజ్ పర్యవేక్షిస్తుంటాడు. మైసూరులోని దర్శన్ ఫామ్‌హౌజ్‌ని కూడా నాగరాజే చూసుకుంటారు.

ఈ కేసులో ఇప్పటివరకు దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 11 మంది అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 8న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణలతో హత్య చేసిన కేసులో దర్శన్‌ను అరెస్టు చేశారు. అతని మృతదేహాన్ని కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని మురుగునీటి కాలువలో పారేశారు. దీనిని మొదటగా ఆత్మహత్యగా అనుమానించిన పోలీసులకు, విచారణ ప్రారంభించిన తర్వాత హత్యగా తేలింది. దీని వెనక దర్శన్ ఉన్నట్లు, అతని సూచనల మేరకే హత్య జరిగినట్లు తేలింది. ఇదిలా ఉంటే ఈ హత్యను తామే చేసినట్లు ఒప్పుకోవాలని ముగ్గురికి దర్శన్ సూచించారని, ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు ఇస్తానని చెప్పారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్‌కి పెళ్లైనప్పటికీ, గత పదేళ్లుగా పవిత్రతో సహజీవనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.