CV Anand Resign: బెంగాల్ ఎన్నికలకు ముందు షాకింగ్.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా

  • బెంగాల్ ఎన్నికలకు ముందు అనూహ్యంగా గవర్నర్ రాజీనామా
  • రాజీనామా వెనుక రాజకీయ కారణాలపై చర్చ
  • స్పందించిన మమతా బెనర్జీ
  • కొత్త గవర్నర్‌గా R. N. రవి నియామకంపై ఊహాగానాలు
Cv Anand Bose

Cv Anand Bose

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈరోజు (మార్చి 5, 2026) ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు లోక్ భవన్ వర్గాలు ధృవీకరించాయి. సుమారు మూడున్నరేళ్ల పాటు బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన బోస్, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వారాల ముందే తప్పుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

రాజీనామా సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనంద బోస్, “నేను గవర్నర్ కార్యాలయంలో తగినంత సమయం గడిపాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని సమాధానమిచ్చారు. అయితే, ఆయన సడన్ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, “రాజీనామా వార్త వినగానే నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం నుండి ఆయనపై ఏదైనా ఒత్తిడి వచ్చిందేమోనని నేను భావిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.

ఆనంద బోస్ రాజీనామాతో ఖాళీ అయిన బెంగాల్ గవర్నర్ పదవిలో ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు సమాచారం ఇచ్చారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే, గవర్నర్ నియామక విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆర్.ఎన్. రవికి కూడా తమిళనాడులో డిఎంకె ప్రభుత్వంతో విభేదాలు ఉన్న నేపథ్యంలో, బెంగాల్‌లో ఆయన నియామకం జరిగితే మమతా ప్రభుత్వంతో సంబంధాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

Sanju Samson: లైవ్ ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సంజు శాంసన్ తండ్రి! కారణం ఇదే..