కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి వరుసగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.. ఇప్పటికే ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చిన్నారుల్లో భరోసా నింపగా.. కేంద్రం కూడా మేమున్నామంటూ ధైర్యాన్ని చెపుతూ.. వారికి ఆర్థికసాయం ప్రకటించింది.. ఈ జాబితాలో మరో రాష్ట్రం కూడా చేరింది.. కరోనా ఫస్ట్ వేవ్‌తో పాటు సెకండ్ వేవ్ కూడా మహారాష్ట్రను అతలాకుతలం చేసింది.. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడమే కాదు.. పెద్ద సంఖ్యలో ప్రజలు కోవిడ్ బారినపడి మృతిచెందారు. అయితే, కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర సర్కార్.. కోవిడ్‌తో తల్లిదండ్రులను ఇద్దరినీ కోల్పోయిన పిల్లల ఖాతాల్లో రూ.రూ.5 లక్షల చొప్పున వేయాలని నిర్ణయం తీసుకుంది.. ఇక, ప్రతీనెల రూ.1,125 భత్యం కూడా ఇవ్వనున్నారు.. ఎఫ్‌డీ చేసిన మొత్తాన్ని వారికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత తీసుకునేందుకు వీలుకల్పించింది.. ఇదే సమయంలో.. తల్లి లేదా తండ్రిని మాత్రమే కోల్పోయిన చిన్నారులకు రూ.2,500 చొప్పున అందించాలని నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి యశోమతి ఠాకూర్ వెల్లడించారు. సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు 162 మంది ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ మొత్తం… ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలకు అదనమని సీఎంవో ప్రకటించింది.. అనాథ పిల్లలు ప్రభుత్వం నడుపుతున్న వసతి గృహాల్లో లేదా వారి బంధువులతో కలిసి ఉండొచ్చని పేర్కొంది.. ఇక, మార్చి 1, 2020 తర్వాత తల్లిదండ్రులు ఇద్దరూ కోవిడ్‌తో మరణిస్తే.. ఆ పిల్లలకు 18 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారే అర్హులు.