Site icon NTV Telugu

Corona Updates : కర్ణాటకలో మళ్లీ కరోనా కలవరం..

Omicron

Omicron

కరోనా వైరస్‌ యావత్తు ప్రపంచాన్ని భయాందోళనుకు గురి చేసిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మరో సారి కోరలు చాస్తోంది. రోజురోజుకు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ రోజువారీ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది. అలాగే, ప్రస్తుతం రోజుకు 16 వేల పరీక్షలు చేస్తుండగా దానిని 20 వేలకు పెంచాలని, అలాగే, ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు చేయాలని చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తమను కోరినట్టు బెంగళూరు మహానగర్ పాలికె డాక్టర్ హరీష్ కుమార్ వెల్లడించారు.

అలాగే, మాల్స్‌తో సహా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించమని కూడా ఆయన తమను ఆదేశించినట్టు తెలిపారు. నేటి నుంచి మార్షల్స్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అయితే తాజాగా కర్ణాటకలో 300 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

Exit mobile version