Ranya Rao Case: రన్యా రావు వ్యవహారం కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కన్నడ నటిగా సుపరిచితమైన రన్యా రావు, బంగారం అక్రమ రవాణాలో అడ్డంగా దొరికింది. ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో రూ.12.56 కోట్ల విలువైన గోల్డ్ బార్స్‌ని నడుముకు చట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. గతంలో చాలా సార్లు కూడా ఆమె ఇలాగే దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ రామచంద్రరావు సవతి కూతురు కావడంతో ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
ఉన్నతాధికారి కూతురు కావడం, హై ప్రొఫైల్ వ్యక్తి కావడంతో రన్యా రావు ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీని దాటుకుని బంగారాన్ని తీసుకువచ్చినట్లు తేలింది. ఎయిర్ పోర్టులో వీఐపీ ప్రోటోకాల్‌ని రన్యా రావు దుర్వినియోగం చేసినట్లు డీఆర్ఐ అధికారులు ఆరోపించారు. రాష్ట్ర ప్రోటోకాల్ అధికారి స్వయంగా ఇమ్మిగ్రేషన్‌కి వెళ్లి, ఫాస్ట్ ట్రాక్ సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం రన్యారావు లగేజీని తీసుకుంటున్న విషయాన్ని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ విధంగా ఆమె ల్యాండింగ్ తర్వాత విమానాశ్రయంలో తనిఖీలను దాటేసి స్మగ్లింగ్‌కి పాల్పడింది.
Read Also: Waqf: “ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం” వక్ఫ్ ఆస్తి.. ఎంఐఎం నేత క్లెయిమ్..
అయితే, ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ‘‘డిపార్ట్‌మెంట్ అధికారుల సూచన మేరకు ప్రోటోకాల్ అందించామని డీఆర్ఐ అధికారుల ముందు పోలీస్ అధికారి అంగీకరించారు. దీంతో ఈ కేసులో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారుల సూచన మేరకే ప్రోటోకాల్ మంజూరు వారు అంగీకరించారు’’ అని డీఆర్ఐ తరుపున వాదించిన స్పెషల్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ) మధురావు కోర్టుకు తెలిపారు.
ఈ సంఘటనలో రన్యా రావు సవతి తండ్రి, ఐపీఎస్ అధికారి, ప్రస్తుత డీజీపీ కే.రామచంద్రారావు ప్రమేయం ఉందా..? అనే దానిపై కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. విచారణ సందర్భంగా రన్యా రావు బెయిల్ పిటిషన్‌ని ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. రూ 50 లక్షలకు మించి కస్టమ్ సుంకం ఎగవేత తీవ్రమైన నేరంగా చెప్పారు. ఇది కస్టమ్స్ చట్టంలోని క్షన్ 135(1)(ఎ) మరియు (బి) కిందకు వస్తుందని, దీనిని శిక్షించదగిన మరియు బెయిల్ ఇవ్వలేని నేరంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు.