Congress: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ‘‘నిందించే వ్యాఖ్యలు’’ చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ‘‘సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం’’ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ నోటీసుల్ని సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో అమిత్ షా సోనియాగాంధీపై ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేసి ఆమె ప్రతిష్టను దిగజార్చాలని చూశారని జైరాంరమేష్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంఖర్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రవర్తనా నియామావళిలోని 188వ నిబంధన ప్రకారం ప్రత్యేక హక్కుల నోటీసులు ఇచ్చారు.
Read Also: Mammootty-Mohanlal: మమ్ముట్టి – మోహన్ లాల్ వివాదం.. “శబరిమల” పూజపై రచ్చ..
‘‘ హోం మంత్రి సోనియా గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆమె గురించి స్పష్టంగా ప్రస్తావించి ఆమెకు ఆరోపణల్ని ఆపాదించారు. ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. అమిత్ షా ప్రకటన పూర్తిగా అబద్ధం, పరువు నష్టం కలిగించేవి’’ అని లేఖలో పేర్కొన్నారు. మార్చి 25న రాజ్యసభలో విపత్తు నిర్వహణ బిల్లు -2024పై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా చేసిన ప్రకటనను జైరాం రమేష్ ప్రస్తావించారు.
‘‘ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిని కాంగ్రెస్ పాలనలో స్థాపించారు. PM-CARES నిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA పాలనలో స్థాపించారు. సర్, కాంగ్రెస్ పాలనలో దేశాన్ని ఒకే కుటుంబం నియంత్రించేది’’ అని అమిత్ షా అన్నారు. నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకుండా, కాంగ్రెస్ నేత పీఎం రిలీఫ్ ఫండ్‌లో భాగంగా ఉండేవారని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జైరాం రమేష్, అమిత్ షాపై సభా హక్కుల ఉల్లంఘన, సభను ధిక్కరించడం అని ఆరోపించారు.