DK Shivakumar: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపటితో ఈ రెండు రాష్ట్రాల్లో విజయం సాధించేది ఎవరో తేలనుంది. అయితే, దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమినే అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ కూటమి మాత్రం అధికారం తామదే అని ధీమా వ్యక్తం చేస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్ని తప్పని రుజువు అవుతుందని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కర్ణాటక రాష్ట్ర పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర దేవాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన శివకుమార్.. తప్పకుండా గెలుస్తాం. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారవుతాయని అన్నారు. “నేను మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రచారం నిర్వహించాను. అక్కడ తప్పకుండా గెలుస్తామన్న నమ్మకం ఉంది. మహారాష్ట్రలో స్వల్ప తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. ఆయన నేతలందరితో కూడా మాట్లాడారు, నేను కూడా మహారాష్ట్రకు వెళ్లాను. పార్టీకి అంతా అనుకూలంగా, సజావుగా సాగుతున్నట్లు నేను చూశాను’’ అని చెప్పారు.
Read Also: Pawan Kalyan Hugs Botsa:అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం.. పవన్‌ను ఆలింగనం చేసుకున్న బొత్స..
జార్ఖండ్ ఫలితాల గురించి అడిగిన సందర్భంలో.. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల గురించి తనకు తెలియదని చెప్పారు. రాష్ట్రంలో జరిగే ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చెప్పారు. కర్ణాటకలోని చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనిపై డీకే శివకుమార్ మాట్లాడుతూ.. గెలుస్తామని చెప్పారు. కుమార స్వామిపై వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన ‘‘కాలా’’ అనే వ్యాఖ్యలు దెబ్బతీస్తాయా..? అని ప్రశ్నించిన సమయంలో, ఆయన తొందరపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు తప్పు అని చెప్పానని శివకుమార్ అన్నారు.