NTV Telugu Site icon

CWC meeting: హైదరాబాద్‌లో కాంగ్రెస్ మీటింగ్.. 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండా..

Congress

Congress

CWC meeting: చాలా ఏళ్ల తరువాత హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరుకాబోతున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇతర ప్రముఖ నాయకులు వస్తున్నారు. ఖర్గే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇదే. కాగా ఈ సమావేశంలో రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలే ప్రధాన ఎజెండా కాబోతున్నాయి.

Read Also: Maharashtra: రెండు జిల్లాల పేర్లు మారుస్తూ నోటిఫికేషన్.. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ కొత్త పేర్లు ఏంటంటే..?

ఈ ఏడాది చివర్లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారిస్తోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి పేరుంది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సారి తప్పకుండా ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని అనుకుంటోంది.

ఇలా ఢిల్లీకి వెలుపల హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించడం చూస్తే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి ఎంత కీలకమో తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ తన 6 హామీలను ప్రకటించనుంది. ఇదిలా ఉంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ కి కీలకంగా మారాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించాలంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.