ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లోనూ మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగబోతోంది.. ఇవాళ ప్రచారానికి తెరపడింది.. అయితే, చివరి క్షణాల్లో అన్నట్టుగా.. ప్రచార సమయం ముగిసే ముందు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ… తాము మరోసారి అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో చెబుతూ.. పంజాబ్ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.. కాంగ్రెస్ తిరిగి అధికారంలో వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. మహిళలకు నెలకు రూ. 1,100 అందిస్తామని, ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చింది.. గురునానక్ స్ఫూర్తితో పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల ముందుకు తెచ్చామని ఈ సందర్భంగా వెల్లడించారు పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇక, మద్యం విక్రయాలు, ఇసుక మైనింగ్‌కు ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. మాఫియాకు చరమగీతం పాడతామన్నారు.. ఆయిల్ సీడ్, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న పంటలను ప్రభుత్వ సంస్ధల ద్వారా సేకరిస్తామని తెలిపింది..
Read Also: VH: రేవంత్-కోమటిరెడ్డి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు.. అదేం గొప్ప..?
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా పైలట్ కావచ్చని…. కానీ, తుఫాన్ చెలరేగినప్పుడు మనం ప్రతికూల పరిస్ధితినీ అనుకూలంగా మలుచుకోవాలనే రీతిలో మ్యానిఫెస్టోకు రూపొందించినట్టు వెల్లడించారు.. మరోవైపు, ఎస్ఏడీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సిద్ధూ.. ఇరు పార్టీల నేతలు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ప్రజలు మార్పు తీసుకురావాలనుకుంటే కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు.. కెప్టెన్ అమరీందర్ సింగ్, సుఖ్బీర్ సింగ్ బాదల్‌లు ఒకే నాణేనికి రెండు వైపుల వంటి వారని, వారివైపు మొగ్గితే తిరోగమనమేనని హెచ్చరించారు సిద్ధూ.. కాగా, పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడగా.. ఈ నెల 20న ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది.. మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.