Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్‌ సహా వీరికి టికెట్లు

Congress Rajya Sabha Candid

Congress Rajya Sabha Candid

Congress Rajya Sabha Candidates List 2026: కాంగ్రెస్ పార్టీ 2026 రాజ్యసభ ఎన్నికల కోసం తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించిన ఈ జాబితాలో పలు కీలక నేతలకు అవకాశం కల్పించింది. ముఖ్యంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు కర్ణాటక కోటా నుంచి రాజ్యసభ టికెట్ కేటాయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ ఖేరా పేరు ఈ జాబితాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో 2022 రాజ్యసభ ఎన్నికల సమయంలో తనకు టికెట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో “బహుశా నా తపస్సులో ఏదో లోపం ఉందేమో” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో ఆ ‘తపస్సు’ ఫలించిందనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

* కాంగ్రెస్‌కు బలమైన కోటగా ఉన్న కర్ణాటక నుంచి ఈసారి ముగ్గురు ప్రముఖ నేతలను పార్టీ బరిలోకి దింపింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి రాజ్యసభకు పోటీ చేయనుండగా, జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు కూడా అవకాశం కల్పించారు. అలాగే మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖ నేత మన్సూర్ అలీ ఖాన్‌ను కూడా కర్ణాటక కోటా నుంచి అభ్యర్థిగా ప్రకటించారు.

×
×
Ad

* మధ్యప్రదేశ్ నుంచి మాజీ లోక్‌సభ సభ్యురాలు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన మీనాక్షి నటరాజన్‌కు రాజ్యసభ టికెట్ లభించింది. మాల్వా ప్రాంతానికి చెందిన ఆమెకు అవకాశం ఇవ్వడం ద్వారా మహిళా నాయకత్వానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

* రాజస్థాన్ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు నీరజ్ డాంగీకి మరోసారి అవకాశం దక్కింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయనపై పార్టీ అధిష్ఠానం మరోసారి విశ్వాసం వ్యక్తం చేసింది.

* తమిళనాడు నుంచి కాంగ్రెస్ డేటా అండ్ అనలిటిక్స్ విభాగం ఛైర్మన్ ప్రవీణ్ చక్రవర్తికి రాజ్యసభ టికెట్ కేటాయించారు. రాహుల్ గాంధీకి సన్నిహిత విధాన సలహాదారుడిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ చక్రవర్తి పార్టీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

* జార్ఖండ్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి, కమ్యూనికేషన్స్ విభాగం సీనియర్ నేత ప్రణవ్ ఝాకు అవకాశం లభించింది. మీడియా నిర్వహణ, సంస్థాగత వ్యవహారాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగానే ఈ అవకాశం వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించిన ఈ జాబితా ద్వారా పార్టీ సామాజిక సమీకరణలు, ప్రాంతీయ సమతుల్యత, సంస్థాగతంగా పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ వంటి నేతలకు అవకాశం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు సంకేతాలు ఇచ్చిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.