Site icon NTV Telugu

Mallikarjun Kharge: ఎన్నికల విధానంపై ప్రజలకు నమ్మకం పోతుంది

Mallikarjun Kharge

Mallikarjun Kharge

ఎన్నికల విధానం, ప్రక్రియ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం నెమ్మదిగా సన్నగిల్లుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. గాంధీ-నెహ్రూ వారసత్వం ఉన్న తాము ప్రత్యర్థుల అబద్దాలను తుత్తునియలుగా చేస్తామన్నారు. ఎన్నికల సంఘం తీరుపై పలు అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దేశానికి అవసరమైన కీలక సంస్థలను తన అధీనంలో.. కనుసన్నల్లో మెలిగేలా అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “కేంద్ర ఎన్నికల సంఘం” లాంటి రాజ్యాంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తోందని వ్యాఖ్యానించారు. దీన్ని అడ్డుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. మారిన ఎన్నికల నియమ, నిబంధనలను వెల్లడించాలని కోర్టు ఆదేశించినా.. ఎందుకు దాచి పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బెళగావి సమావేశాల తర్వాత సరికొత్త ఉత్సాహంతో కార్యకర్తలు అకుంఠిత దీక్షతో పని చేయాలని.. ప్రత్యర్థుల అబద్దాలను, కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

గురు, శుక్రవారాల్లో కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు. మొత్తంగా 200 మంది కీలక నేతలు ఈ మీటింగ్‌లో పాల్గొంటారని ఏఐసీసీ వెల్లడించింది. అయితే ఈ సమావేశానికి సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ హాజరుకాలేదు. సోనియాకు అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయారు.

మహాత్మాగాంధీ నగర్‌లో గురువారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. డిసెంబర్ 27 ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్‌ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ రెండు తీర్మానాలు ఆమోదించనుంది. వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కూడా కీలక చర్చ జరపనున్నారు. ఇక ఈ భేటీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గురించి కూడా చర్చించనున్నారు.

Exit mobile version