Site icon NTV Telugu

Congress: నేటి నుంచి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు.. మొత్తం ఆరు తీర్మానాలు..

Congress

Congress

Congress Plenary Meetings: ఛత్తీస్ గడ్ రాజధాని రాయపూర్ వేదికగా నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ ప్లీనరీ జరగనుంది. ఈ రోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ సమావేశాల్లో మొత్తం 6 తీర్మానాలను స్టీరింగ్ కమిటీ ప్రవేశపెట్టనుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీర్మానాలను ‘‘సబ్జెక్ట్ కమిటీ’’ ఖరారు చేయనుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహించే అంశంపై చర్చించి స్టీరింగ్ కమిటీ నిర్ణయించనుంది.

Read Also: Wipro: జీతాల్లో కోతలు.. విప్రోపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగసంఘం డిమాండ్..

25వ తేదీన (శనివారం) ఉదయం 9:30 గంటలకు “పార్టీ జెండా” వందనం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షోపన్యాసం ఉంటుంది. ఫిబ్రవరి 25వ తేదీన మూడు తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది. ఇందులో రాజకీయ, ఆర్థిక, విదేశీ విధానానికి సంబంధించి తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి, ఆమోదించనున్నారు. ఇదే రోజున సోనియా గాంధీ ఉపన్యాసం ఉండనుంది. ఫిబ్రవరి 26(ఆదివారం) మరో మూడు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. యువత-నిరుద్యోగం, సామాజిక న్యాయం-సాధికారత, వ్యవసాయరంగ సమస్యలు ఏఐసీసీ చర్చించనుంది.

చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అధ్యక్షుడు ఖర్గే ఉపన్యాసంతో ప్లీనరీ ముగియనుంది. ముగింపు ఉపన్యాసంలో పార్టీ 5 సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం ఏఐసీసీ సమావేశాల్లో, ఆ తరువాత 4 గంటలకు జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. దీంతో పాటు 2024 ఎన్నికలు రాబోతున్న తరుణంలో పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనే దానిపై కూడా ప్లీనరీలో చర్చ జరగనుంది.

Exit mobile version