NTV Telugu Site icon

Rahul Gandhi: ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. తీర్మానాన్ని ఆమోదించిన కాంగ్రెస్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికవ్వాలన్నదే సీడబ్ల్యూసీ కోరిక అని ఆమె అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, అలప్పుజా నుంచి ఎంపీగా గెలిచిన కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ రాహుల్ గాంధీని ఏకగ్రీవంగా అభ్యర్థించిందని చెప్పారు.

Read Also: Nitish Kumar: నితీష్ కుమార్ పార్టీకి రెండు కేబినెట్ బెర్తులు..

ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన కృషిని సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడింది. ఆయన చేసిన ‘భారత్ జోడోయాత్ర’ని ప్రశంసించింది. ఆయన ఆలోచన, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఈ రెండు యాత్రలు దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపుగా అభివర్నించింది. లక్షాలాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ఓటర్లను ఆకర్షించిందని తీర్మానం పేర్కొంది. రాజ్యాంగ పరిరక్షణ 2024 ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారిందని చెప్పింది. ప్రజలందరి భయాలు, ఆందోళనలు, ఆకాంక్షలు, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, ఓబీసీల ఆందోళనలు విన్న రాహుల్‌జీ యాత్రల పరిణామమే ఎన్నికల ప్రచారంలో అత్యంత శక్తివంతంగా ప్రతిధ్వనించిన పంచన్యాయ్ మేనిఫెస్టో హామీ కార్యక్రమని చెప్పింది.

శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత అవ్వాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావడం 140 కోట్ల మంది భారతీయుల కల అని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో వరసగా ఆ పార్టీ 44, 52 సీట్లను మాత్రమే గెలుచుంది. 2024 ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచింది.