Congress: ‘ఇది ఆందోళనకరం’.. కాల్పుల విరమణలో చైనా వాదనపై కాంగ్రెస్ వ్యాఖ్య

  • చైనా వాదనపై స్పందించిన కాంగ్రెస్
  • ఇది ఆందోళనకరం అంటూ వ్యాఖ్య
  • మోడీ స్పందించాలంటూ జైరాం రమేష్ డిమాండ్
Jairam Ramesh

Jairam Ramesh

భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణలో తమ పాత్ర కూడా ఉందంటూ చైనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. నిన్నామొన్నటిదాకా ట్రంప్ పదే పదే తానే ఆపానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా చైనా చేరింది. ట్రంప్‌తో పాటు చైనా కూడా ముఖ్యపాత్ర పోషించిందంటూ వ్యాఖ్యానించింది. అయితే ఈ వాదనను భారత విదేశాంగ తోసిపుచ్చింది. కాల్పుల విరమణలో మూడో పక్షం ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.

తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ స్పందించింది. మన జాతీయ భద్రతపై అనుమానంగా ఉందని.. ఇది ఆందోళనకరం అని వ్యాఖ్యానించింది. కాల్పుల విరమణ క్రెడిట్‌ను ట్రంప్, చైనా తీసుకుంటున్నా ప్రధాని మోడీ ఎందుకు మౌనం వీడడం లేదని ఎక్స్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. తక్షణమే స్పందించాలని కోరారు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం మే 7న ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల తర్వాత మే 10న ఇరు దేశాల చర్చలతో కాల్పుల విరమణ జరిగింది. అయితే ఈ క్రెడిట్‌ను ట్రంప్ కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో బెదిరించడంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. అయితే ట్రంప్ వాదనను భారతదేశం తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. అయినా కూడా ట్రంప్ ఏ మాత్రం తగ్గలేదు. ఎక్కడికెళ్లినా.. ఏ నేతతో భేటీ అయినా ప్రపంచ వ్యాప్తంగా భారత్-పాకిస్థాన్ యుద్ధంతో పాటు ఎనిమిది యుద్ధాలు ఆపినట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇంకోవైపు భారత్ నిరంతరం ఖండిస్తూనే ఉంది. అయినా కూడా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అయినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఇలా ఇప్పటి వరకు 70 సార్లు ఆ విషయాన్ని ట్రంప్ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Faridabad: ఫరీదాబాద్‌లో దారుణం.. కదులుతున్న వ్యాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్

తాజాగా ఈ జాబితాలో చైనా కూడా చేరింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో ట్రంప్‌తో పాటు చైనా కూడా కృషి చేసిందని విదేశాంగ మంత్రి వాంగ్ యి ప్రకటించారు. భారత్-పాకిస్థాన్‌తో పాటు ఉత్తర మయన్మార్ ఉద్రిక్తతలు, కంబోడియా-థాయ్‌లాండ్, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలు, ఇరాన్ అణు సమస్యతో పాటు ప్రపంచ సంఘర్షణలకు బీజింగ్ శాంతికర్తగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు తర్వాత భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయితే చైనా వాదనను భారత్ ఖండించింది.