Yusuf Pathan: మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తరుపున ఆయన వెస్ట్ బెంగాల్‌లోని బర్హంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, తాజాగా ఆయనపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2011లోని ఫోటోలను ఎన్నికల ప్రచారంలో వాడుకోవడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. 2011 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ల ఫోటోలను, బ్యానర్లను ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘించడమే అని ఫిర్యాదు చేసింది.
Read Also: AAP: ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఆ పార్టీ ఏకైక లోక్‌సభ ఎంపీ..
భారతరత్న సచిన్ టెండూల్కర్, ఇతర హైప్రొఫైల్ క్రికెట్ సెలబ్రెటీల ఫోటోలు ఉపయోగించడాన్ని ఫిర్యాదులో కాంగ్రెస్ పేర్కొంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2011 క్షణాలు ప్రతీ భారతీయులు గర్వంతో గౌరవించే సెంటిమెంట్ అని కాంగ్రెస్ పేర్కొంది. ఇలాంటి వాటిని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోకూడదని పార్టీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో మన జాతీయ నాయకుల ఫోటోలను అనైతికంగా మరియు చట్టవిరుద్ధంగా ఉపయోగించడాన్ని ఆపాలని ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ కోరింది. బర్హంపూర్ నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరికి ప్రత్యర్థిగా టీఎంసీ నుంచి యూసఫ్ పఠాన్ బరిలోకి దిగారు.