మహిళలు గురించి ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశ జనాభా తగ్గిపోతుందని.. ఇది ఆందోళనకరమైన అంశాన్ని పేర్కొన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలు ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. తాజాగా ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తప్పుపట్టారు. వరుసగా పిల్లల్ని కనడానికి మహిళలు ఏమైనా కుందేళ్లా? అని ప్రశ్నించారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య వెంటాడుతోందని.. ఖాళీగా ఉన్నవారికి తమ బిడ్డలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ధ్వజమెత్తారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నిరుద్యోగ యువకులకు ఆడ పిల్లల్ని ఇచ్చేందుకు ఎవరూ ఇష్టపడరన్నారు. నిరుద్యోగం కారణంగానే చాలా మంది యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదన్నారు. ఉద్యోగాలే లేనప్పుడు భార్యలను ఎలా పోషిస్తారని నిలదీశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్పేవాళ్లు ఎంత మంది పిల్లల్ని కన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారి అనుభవం ఏంటో అందరికీ తెలుసన్నారు.