దేశవ్యాప్తంగా ‘ఓటు చోరీ’ జరుగుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ప్రారంభం కానుంది. ర్యాలీకి ముందు ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. అనంతరం అక్కడి నుంచి నేతలంతా నేరుగా రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోనున్నారు.
‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఐదున్నర కోట్ల మందితో సంతకాలు సేకరించింది. ఈ సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించనున్నట్లు పార్టీ ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలనే డిమాండ్‌ను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని కొనసాగించనున్నట్లు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అలాగే ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీనియర్ నేతలు జైరామ్ రమేష్, సచిన్ పైలట్, ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు—కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. అదేవిధంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు.
ఇటీవల లోక్‌సభలో ‘ఎన్నికల సంస్కరణలు’పై చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను కుమ్మక్కై తారుమారు చేస్తోందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తమ స్వార్థానికి అనుకూలంగా ఉపయోగించుకుంటోందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి మూడు కీలక ప్రశ్నలు సంధించారు. పారదర్శక ఓటర్ల జాబితాను ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని, ఈవీఎంల పనితీరుపై ఉన్న అనుమానాలను ఎందుకు నివృత్తి చేయడం లేదని, అలాగే హర్యానాకు చెందిన బీజేపీ నేత బీహార్‌లో కూడా ఓటింగ్‌లో పాల్గొన్నారనే ఆరోపణలపై సాక్ష్యాలతో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూడాలనే ఉద్దేశంతో చేపట్టిన ‘ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ’ (ఎస్ఐఆర్) ప్రక్రియను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అనవసర విమర్శలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ‘ఓట్ల దొంగతనం’ అంశాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీని కీలక మలుపుగా భావిస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు..