Congress: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోసారి ఆప్ హ్యాట్రిక్ సాధిస్తుందా.? లేక బీజేపీ 27 ఏళ్ల తర్వాత ప్రభంజనం సృష్టిస్తుందా అని ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే, శనివారం మొదలైన ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిపత్యం కొనసాగిస్తోంది. కౌంటింగ్ మొదలైన గంటలోసే బీజేపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. మరోవైపు ఆప్ పోటీని ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 45, ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి.
Read Also: Saurabh Bharadwaj: ఆప్‌ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది..
ఇదిలా ఉంటే, దశాబ్దాల చరిత్ర ఉండీ, పలుమార్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. ఏ స్థానంలో బీజేపీకి గానీ, ఆప్‌కి కానీ పోటీ ఇచ్చే పరిస్థితే కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకున్నట్లు కనిపించిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో నామమాత్రంగా మిగిలింది. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ని ఓటర్లు పట్టించుకోలేదు.
కాంగ్రెస్ ప్రముఖ నేతల్లో ఒకరైనా న్యూఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న సందీప్ దీక్షిత్, మరో కీలక నేత అల్కాలాంబా కల్కాజీ స్థానం నుంచి వెనకంజలో ఉండటం గమనార్హం. కాంగ్రెస్‌ని ఢిల్లీ ఓటర్లు తిరస్కరించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బద్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత దేవేంద్ర యాదవ్ మాత్రమే లీడింగ్‌లో ఉన్నారు.