NTV Telugu Site icon

Emergency: ‘‘ఎమర్జెన్సీ’’పై రాష్ట్రపతి, స్పీకర్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నిరసన..

Congress

Congress

Emergency: ఇందిరా గాంధీ విధించిన ‘‘ఎమర్జెన్సీ’’కి జూన్ 25, 2024తో 50 ఏళ్ల నిండాయి. అయితే, ఈ అంశంతో కాంగ్రెస్‌ని బీజేపీ టార్గెట్ చేస్తోంది. ఎమర్జెన్సీపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఈ రోజు జరిగిన ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి సీనియర్ నేతలు గురువారం లోక్‌సభ స్పీకర్‌తో సమావేశమై..‘‘ఎమర్జెన్సీ చీకటి రోజుల’’ గురించి పార్లమెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యల గురించి నిరసించారు. పార్లమెంట్ విశ్వనీయతను ప్రభావితం చేసే చాలా తీవ్రమైన విషయంగా దీనిని ప్రతిపక్ష కాంగ్రెస్ పేర్కొంది. పార్లమెంటరీ సంప్రదాయాల అపహాస్యం పట్ల తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేసింది.

బుధవారం స్పీకర్‌గా ఎన్నికైన తర్వా ఓం బిర్లా మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా అభివర్ణించారు. అయితే, స్పీకర్ పదవి నుంచి ఇలాంటి ప్రకటన రావడం మంచిది కాదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన, ఆ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వారి సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని నిన్న స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెన్‌తో పాటు దాని మిత్రపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also:Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్

అయితే, ఎమర్జెన్సీపై స్పీకర్ చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ఎమర్జెన్సీని తీవ్రంగా ఖండించినందుకు, ఆ సమయంలో అతిక్రమణలను ఎత్తిచూపినందుకు, ప్రజాస్వామ్యం గొంతు నొక్కే విధానాలను ప్రస్తావించినందుకు తాను సంతోషిస్తున్నాని ప్రధాని అన్నారు. భారత ప్రజస్వామ్యానికి ఎమర్జెన్సీ నల్లమచ్చ, రాజ్యాంగాన్ని ఎలా రద్దు చేశారో, దేశాన్ని ఎలా జైలుగా మార్చారో, ప్రజాస్వామ్యాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారో కొత్త తరం మరిచిపోదని ప్రధాని అన్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ.. ఎమర్జెన్సీ రాజ్యాంగంపై అతిపెద్ద, ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. దేశం అటువంటి రాజ్యాంగేతర శక్తులపై విజయం సాధించిందని ఆమె అన్నారు. దీంతో అధికార బీజేపీ ఈ వ్యాఖ్యలపై హర్షధ్వానాలు చేయగా, ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. ఇండియా కూటమి ఎంపీలు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణస్వీకారం చేయడం, దేశంలో బీజేపీ అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిందని ఇండియా కూటమి పదేపదే విమర్శలు చేస్తున్న క్రమంలో ‘ఎమర్జెన్సీ’ అంశంతో కాంగ్రెస్‌ని బీజేపీ ఇరుకున్న పెడుతోంది.