Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..

  • ఉత్తర్ ప్రదేశ్‌లో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
  • సమాజ్‌వాదీ, కాంగ్రెస్ మధ్య పొత్తు పంచాయతీ..
  • చర్చలకు ప్రియాంకా గాంధీ సారధ్యం..
Up Elections

Up Elections

Congress: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌ల మధ్య పొత్తు పంచాయతీ ఏర్పడింది. కాంగ్రెస్ 125 స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు 50 స్థానాలే ఎక్కువ అని ఆ ఎస్పీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీట్ల పంపకాలపై చర్చలను ముందుండి నడిపించే బాధ్యతను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రియాంకా గాంధీకి అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రియాంకా గాంధీ సోమవారం యూపీ కాంగ్రెస్ నేతలతో సుమారు 3 గంటల పాటు సమావేశయ్యారు. ఈ సమావేశాల్లో 175 స్థానాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ 100 స్థానాలతో ఓ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం మరోసారి ప్రియాంకా గాంధీ యూపీ నేతలతో భేటీ కానున్నారు. దీని తర్వాత ఎస్పీకి 125 నుంచి 150 స్థానాలో కూడిన ప్రతిపాదన జాబితాను అందించనున్నారు.

2024 లోక్‌సభ, 2017 అసెంబ్లీ ఫలితాల అధారంగా సీట్ల ఎంపిక చేయనున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పొత్తులో 17 ఎంపీ సీట్లు కేటాయిస్తే, 06 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించగా, మరో 42 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ 80 స్థానాలను కాంగ్రెస్ తన జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇక అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలను కూడా కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఒక్క అసెంబ్లీ సీటును కూడా గెలుచుకోలేకపోతోంది.

ఇదిలా ఉంటే, కాంగ్రెస్ 125 నుంచి 150 స్థానాలు కోరుతుంటే, ఎస్పీ మాత్రం కాంగ్రెస్‌కు 60-65 స్థానాలకు మించి కేటాయించేందుకు ఇష్టపడటం లేదు. అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పదే పదే చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలు ఉంటే సుమారు 350 చోట్ల తామే పోటీ చేయాలని అఖిలేష్ భావిస్తున్నట్లు సమాచారం.