ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖించారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నుంచి పెద్దగా రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు కిరణ్ కుమార్ రెడ్డి.
తాజాగా కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. త్వరలోనే ఆయన్ను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఏఐసీసీ సెక్రటరీ మయ్యప్పన్, కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ టూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపు మేరకు బహుశా కిరణ్ కుమార్ రెడ్డి స్పందించి ఉంటారని ఆయన అన్నారు. అందుకే మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ఉంటారని భావిస్తున్నానని మయ్యప్పన్ అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఏ స్థాయిలో సేవలు అందించాలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పార్టీ వల్ల పదవులు, అధికారం, ప్రయోజనాలు పొందిన నేతలు తిరిగి పార్టీకి సేవ చేయాల్సిన సమయం వచ్చిందని… ఇటీవల ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ శిబిర్ లో సోనియాగాంధీ పిలుపునిచ్చారు.
గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి మరింత క్రియాశీలకంగా పనిచేయాలని ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమెన్ చాందీతో సహా, మేమంతా కోరామని మయ్యప్పన్ తెలిపారు. జాతీయ స్థాయిలో, లేదా రాష్ట్ర స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచించడం స్వాగతిస్తున్నామని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి గా పనిచేసి మంచి అనుభవం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతల సేవలు పార్టీ కి చాలా అవసరం అని మయ్యప్పన్ అన్నారు.