Site icon NTV Telugu

Congress-DMK: తమిళనాట డీఎంకే-కాంగ్రెస్-కమల్‌హాసన్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు..

Rahul Gandhi

Rahul Gandhi

Congress-DMK: లోక్‌సభ ఎన్నికల తేదీలు ఈసీ విడుదల చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పలు పార్టీల మధ్య పొత్తుల చర్చల్లో వేగం పెరిగింది. తాజాగా తమిళనాడులోని అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్ పూర్తైంది. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం)తో కూడా సీట్ల ఒప్పందం ఖరారైంది. కాంగ్రెస్ పార్టీకి 10 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: Hardeep Singh Nijjar: ఖలిస్తాన్ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్ వీడియో వైరల్..

ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్, డీఎంకే మధ్య సమావేశం తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. మరోవైపు 2025 రాజ్యసభ ఎన్నికల కోసం కమల్ హాసన్ పార్టీకి ఒక సీటు కేటాయించారు. దేశ సంక్షేమం కోసమే తమ పార్టీ డీఎంకేలో చేరినట్లు ఆయన తెలిపారు. తాను పోటీ చేయనని, ఏ పదవిని ఆశించనని ఆయన చెప్పారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సీఎం స్టాలిన్‌ని కలిసిన తర్వాత కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో మొత్తం 39 ఎంపీ స్థానాలతో పాటు పుదుచ్చేరి సెగ్మెంట్‌లో కూడా ఎంఎన్ఎం ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పలు ప్రాంతీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలతో డీఎంకే ఇప్పటికే పొత్తును ఖరారు చేసుకుంది సీపీఐ, సీపీఎంలకు రెండు సీట్లు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీకి, కొంగు దేశ మక్కల్ కట్చిలకు ఒక్కో సీటును కేటాయించారు. విడుతలై చిరుతైగల్ కట్చికి రెండు స్థానాలు కేటాయించారు. 2019లో తమిళనాడులో39 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. మరోసారి కూడా తమిళనాడులో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

Exit mobile version