వరసగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కేవలం సొంతంగా ఇప్పుడు రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. వరసగా ఎదురువుతున్న పరాభవాలు పార్టీ కార్యకర్తలను, నేతలను నిరాశ పరుస్తున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నా పంజాబ్ రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయింది. దీంతో పాటు ఈ ఏడాది మొదట్లో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైంది. వరసగా కీలక నేతలు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి గోవాలో కూడా భారీ ఎదురుదెబ్బ తాకే అవకాశం కనిపిస్తోంది. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రోజు జరిగిన పార్టీ సమావేశానికి దూరంగా ఉన్నారు. గోవాలో రెండు వారాల బడ్జెట్ సెషన్ కు ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని గోవా కాంగ్రెస్ కొట్టి పారేసింది. మా ఎమ్మెల్యేలను బీజేపీ భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని.. కానీ మా ఎమ్మెల్యేలు అంతా ఐక్యంగా ఉన్నారని గోవా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ దినేష్ గుండూ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరుతారనే పుకార్లను గోవా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమిత్ పాట్కర్ ఖండించారు.
Read Also: Andhra Pradesh: ఎల్లుండి సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్న ద్రౌపది ముర్ము
ఇదిలా ఉంటే గోవా అసెంబ్లీ స్పీకర్ రమేష్ తవాడ్కర్ మంగళవారం ఎన్నిక జరగాల్సి ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దీంతో పాటు మహారాష్ట్ర గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీంతో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి గోవాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
